నీచానికి తెగబడ్డ తల్లిదండ్రులు.. డబ్బులు తీసుకుని 38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల కూతురికి పెళ్లి

by sudharani |
నీచానికి తెగబడ్డ తల్లిదండ్రులు.. డబ్బులు తీసుకుని 38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల కూతురికి పెళ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మహిళలు అన్ని రంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. కానీ, కొన్ని చోట్ల మాత్రం ఇంకా మహిళలు, బాలికలు అణిచివేతకు గురవుతున్నారు. ఆడపిల్ల పుట్టిందంటే పురిటిలోనే చంపేస్తున్నారు. లేదంటే డబ్బులకు బేరం పెట్టి అమ్మేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తమ 7 ఏళ్ల బిడ్డని 38 ఏళ్ల వ్యక్తికి అమ్మేయడంతో.. అతడు ఆ చిన్నారిని వివాహం చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా మనియాకు చెందిన 7 ఏళ్ల చిన్నారిని భూపాల్ సింగ్ (38) అనే వ్యక్తి రూ.4.50 లక్షలకు కొనుగోలు చేశాడు. అనంతరం వివాహం చేసుకున్నాడు. అయితే బాలిక పేరెంట్సే ఈ పెళ్లి చేసినట్లు తేలింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను కాపాడి సంరక్షణ కేంద్రానికి తరలించామని జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నమని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story