అందుకోసమే కదా నీ సారీ..? మోడీ క్షమాపణపై జూలకంటి ఎద్దేవా

by Sridhar Babu |
julakanti
X

దిశ, హుజూర్ నగర్: ప్రజలకు న్యాయం జరగాలంటే పోరాటమే ఆయుధం కావాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో జరగనున్న జిల్లా మహా సభలకు సంబంధించి జరిగిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడారు. మూడు రైతు చట్టాల రద్దు అనంతరం మోడీ చెప్పిన క్షమాపణ కార్పోరేట్ కంపెనీల కోసమే అని ఎద్దేవా చేశారు.700 మంది రైతుల మరణాలు, రాజద్రోహం కేసులకు క్షమాపణ సరిపోదన్నారు. కొన్ని రాష్ట్రాలలో త్వరలో జరగనున్న ఎన్నికలే చట్టాల రద్దుకు కారణమని విమర్శించారు.

మోడీ ప్రభుత్వం పెట్రో, డీజిల్ ధరల పెంపుతో సుమారు రూ.15 లక్షల కోట్లు ప్రజల నుండి వసూలు చేసిందన్నారు. దేశంలో బీజేపీ, మోడీ డౌన్ ఫాల్ మొదలైందని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ కమ్యునిజం వైపు చూస్తున్నాయని తెలిపారు. పెట్టుబడి దారీ విధానాలతో సమాజం బాగుపడదన్నారు. డిసెంబర్ లో హుజూర్ నగర్ పట్టణంలో జరగనున్న సూర్యాపేట జిల్లా సీపీఎం మహాసభలకు పార్టీ శ్రేణుల సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదగిరి రావు, బుర్రి శ్రీరాములు, రాములు, రవినాయక్, నాగారపు పాండు, ములకలపల్లి సీతయ్య, దుగ్గి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed