- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాడర్ ఉన్నా.. తెలంగాణలో పట్టు తప్పిన సీపీఎం..!
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటరీ రాజకీయాల్లో క్రియాశీలక స్థానంలో ఉన్న పార్టీల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) ఒకటి. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆ పార్టీది ప్రత్యేక స్థానమే.. పార్టీకి అనుబంధంగా ఉన్న ప్రజాసంఘాలతో అతిపెద్ద నెట్ వర్క్ తో రాజకీయంగా అత్యంత ప్రభావాన్ని చూపగల వామపక్ష పార్టీల్లో సీపీఎం నెంబర్ వన్. బూర్జువా రాజకీయ పార్టీల్లో ఎక్కడా కనిపించని విధంగా సామాస్య కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకూ ఒకే విలువను పాటించడంలో సీపీఎంది ప్రత్యేక పంథా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ రాజకీయంగా సీపీఎం వెనకబాటుతానానికి గురవుతోంది. పేదల పక్షపాతిగా నిలిచే ఎర్రజెండా వారికి సంక్షేమ పథకాలను అందించడానికి, భూవిముక్త పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిని సీపీఎం కాలాంతర తప్పిదాలతో ప్రజల నుంచి దూరం జరుగుతూ వస్తోంది.
భౌగోళిక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజా పాలక పునర్నిర్మాణం అవసరమని మేధావులు, రాజకీయ శక్తులు ముందుగానే అంచనా వేశాయి. ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర నినాదానికి ఆ పార్టీ కట్టుబడి ఉంది. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక సామాజిక తెలంగాణ అవసరమని గుర్తించినా.. లక్ష్య సాధనలో చతికిల పడింది. సామాజిక తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక( టీ– మాస్ )వేదికగా అనేక రాజకీయ, సామాజిక, ఉద్యమ సంఘాలను ఒక వేదిక మీదకు తీసుకురాగలిగింది. సుమారు వంద సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన ఈ వేదికకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కన్వీనర్ గా వ్యవహరించారు. అన్ని జిల్లాల్లోనూ టీమాస్ ఫోరాలు రూపం దాల్చాయి. అయితే కొంత కాలానికే టీ–మాస్ ఉనికి లేకుండా పోయాయి. కమ్యూనిస్టుల ఐక్యత డిమాండ్, అవసరం సంగతి ఎలా ఉన్నా.. కమ్యూనిస్టు, అంబేద్కరిస్టుల ఐక్యత దేశంలో తక్షణ అవసరంగా విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కు ఆ ఆపార్టీ ప్రాణం పోసింది. అయితే ప్రధాన వామపక్ష పార్టీలుగా ఉన్న సీపీఎం, సీపీఐ రెండు వేర్వేరు గ్రూపులను కట్టడమేగాక విడివిడిగా నాయకత్వం వహించడం వామపక్ష రాజకీయాల్లో అతిపెద్ద బలహీనతగా మిగిలిపోయింది.
2018 ఎన్నికలే లక్ష్యంగా ఏర్పడిన బీఎల్ఎఫ్రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడంతో పాటు ఎన్నికల్లోనూ పోటీ చేసింది. అయితే 2014 నాటి ఓట్లతో పోలిస్తే ఆ ఎన్నికల్లో పార్టీ ఓటింగ్ శాతం మరింత పడిపోవడం గమనార్హం.. ఆ సమయంలో బీఎల్ఎఫ్ ఏర్పాటును రాజకీయ కుట్రగా అభివర్ణించిన వారు ఉన్నారు. కేసీఆర్ ను మళ్లీ గెలిపించే బాధ్యతలను సీపీఎం భుజాలకెత్తుకుందున్న విమర్శలకు ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పలేకపోయారు. రాష్ట్రస్థాయిలోని ఉమ్మడి సమస్యలపై పార్టీ సమర్థవంతమైన పోరాటాలను ఈ ఏడండ్ల కాలంలో నిర్వహించలేదనే చెప్పాలయి. అదే కాలంలో స్థానికంగా పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో అక్కడి నాయకత్వం సమర్థవంతంగా పనిచేసిందనడంలో సందేహం లేదు.
గ్రేటర్ లో వరద ముంపు సమయంలో బాధితులకు ప్రభుత్వ సాయం అందడం కోసం, డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాలు, ఇతర స్థానిక సమస్యలపై సిటీ కమిటీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను సామాన్యులకు చేర్చేందుకు ప్రభుత్వ విభాగాలపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం కొనసాగింది. జిల్లాల్లోనూ మౌలిక సదుపాయాలు, ఇతర ప్రజా సమస్యలపై అక్కడి నాయకత్వం నిరంతరం పోరాడుతూనే వస్తోంది. పాదయాత్రలు, సమావేశాల ద్వారా పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. కరోనా సమయంలో పార్టీ కార్యాలయాలన్నీ కొవిడ్ కేర్ సెంటర్ గా మార్చి ప్రజాసేవలో తాము ఎప్పటికీ ముందేనని సీపీఎం విమర్శకులకు జవాబు ఇచ్చింది. అయితే రాజకీయంగా మాత్రం బలహీనపడుతూ వస్తుండటమే బాధకరం. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న ఏకైక ఎమ్మెల్యే సున్నం రాజయ్య తర్వాత ఆ పార్టీ మళ్లి అడుగుపెట్టలేకపోయింది.
ఆలస్యంగానైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు ప్రకటించినా గెలిపించుకోలేకపోయాయి. నాగర్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతునివ్వడం ద్వారా ఈ ఏడాది అతిపెద్ద అప్రతిష్టను మూట కట్టుకున్నారు. ఈ అంశం పార్టీ అంతర్గతంగా పెద్ద రాద్దాంతానికే దారి తీసింది. వామపక్ష పార్టీలకు పెద్దన్న పాత్రలో వ్యవహరించే సీపీఎం తనకున్న క్షేత్రస్థాయి క్యాడర్ బలాన్ని అంచనా వేయడం లో విఫలమవుతోంది. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే సాంప్రదాయాన్ని వదిలి, వ్యక్తిస్వామ్య విధానంలోకి అడుగుపెట్టడమే ఆ పార్టీ పతనానికి కారణమనే విశ్లేషణలు పార్టీ అంతర్గత నాయకులు చేస్తున్నారు. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీలు మేలుకొని ప్రజాపక్షాన్ని ఆశ్రయించకపోతే ప్రజలకు జరుగుతున్న నష్టానికి నైతిక బాధ్యత వహించక తప్పదు.