‘రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్ధనలకు అనుమతి లేదు’

by Shyam |   ( Updated:2021-05-13 08:24:55.0  )
‘రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్ధనలకు అనుమతి లేదు’
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : నగరంలో లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కరోనా కష్ట సమయంలో పోలీసులు ఎంతో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు . పోలీసు అధికారులు, సిబ్బంది కరోనాను నియంత్రించడాన్ని సవాలుగా తీసుకుని పనిచేస్తున్నారని, ప్రజల ప్రాణాలను కాపాడటానికి పోలీసులు ముందు వరుసలో ఉన్నారని అన్నారు. విధి నిర్వహణ సమయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు కూడా పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ట్రాఫిక్ కమిషనర్ అనిల్ కుమార్, సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ పి. విశ్వ ప్రసాద్ , ట్రాఫిక్ డీసీపీ ఎల్.ఎస్. చౌహాన్ తదితర అధికారులతో కలిసి ట్యాంక్ బండ్ ఏరియా చెక్ పోస్టులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ లాక్ డౌన్‌ కారణంగా రంజాన్ పండుగ రోజున పాతబస్తీలో సామూహిక సమావేశాలకు అనుమతి లేదన్నారు. నిబంధనల మేరకు అన్ని దుకాణాలు సమయానికి మూసివేయాలని అన్నారు. ముస్లీం సోదరులు ఇండ్లలో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత వీడియోలను ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. వివాహాలు , అంత్యక్రియలకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. రంజాన్ ప్రార్థనలపై కరోనావైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి రంజాన్ ప్రార్థనల ప్రాముఖ్యతపై మత నాయకులు, రాజకీయ నాయకులు, ఇమామ్‌లు, మౌలానాస్ లతో కలిసి హోంమంత్రితో బుధవారం వెబినార్ ద్వారా సమావేశం నిర్వహించినట్లు సీపీ చెప్పారు.

నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లాక్‌డౌన్ పర్యవేక్షణ జరుగుతోందని, ఇందుకు వారు 24 గంటల డ్యూటీలో ఉంటున్నారని వారికి నమస్కరిస్తున్నానని సీపీ అన్నారు . హైదరాబాద్ నగరంలో 180 పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఇప్పటివరకు 3000 కు పైగా పాస్ లు జారీ చేయడం జరిగిందని, చాలా మంది పాస్ కోసం, చిన్న విషయాల కోసం కూడా దరఖాస్తు చేస్తున్నారని, పాస్ అత్యవసరం అయితేనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు .

Advertisement

Next Story

Most Viewed