యూరప్‌‌లో రూ. 2.61 కోట్ల ధర పలికిన ఆవు

by Shyam |
యూరప్‌‌లో రూ. 2.61 కోట్ల ధర పలికిన ఆవు
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా కొన్ని దున్నపోతుల కోట్ల రూపాయల ధర పలుకుతుండగా, ప్రత్యేక జాతికి చెందిన ఆవుల ధరలు మాత్రం లక్షల్లో ఉండే అవకాశం ఉంది. అయితే ‘పోష్ స్పైస్’ అనే ఆవు మాత్రం రూ. 2 కోట్ల 62 లక్షలకు అమ్ముడుపోయి బ్రిటన్‌లో అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డుల్లోకి ఎక్కింది. కాగా బ్రిటన్‌లో సగటు ఇంటి ఖరీదు కన్నా, దీని ధరే ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఆవు పూర్తి పేరు విలోడ్జ్ పోష్‌స్పైస్ కాగా, అత్యధిక ధరకు అమ్ముడుపోయి గత రికార్డులను బద్దలు కొట్టింది.

లిమోసిన్ జాతికి చెందిన ‘పోష్ స్పైస్’ బ్రిటన్‌లోనే కాక యూరప్ మొత్తంలోనూ అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. నవంబర్ 2019లో జన్మించిన ఈ ఆవును ష్రాప్‌షైర్‌లోని షిఫ్నాల్‌‌కు చెందిన క్రిస్టీన్ విలియమ్స్, పాల్ టిప్పెట్స్‌ పెంచుకుంటున్నారు. కుంబ్రియాలోని కార్లిస్లేలో ఇటీవలే నిర్వహించిన వేలంలో పోష్ స్పైస్ ఆకారం, స్టైల్‌తో పాటు దాని జన్యు లక్షణాలు చాలా మంది బిడ్డర్ల దృష్టిని ఆకర్షించాయి. అంతేకాదు, పోష్ స్పైస్‌కు జన్మనిచ్చిన తల్లి ‘జింజర్ స్పైస్’‌ కారణంగా ఆ ఆవు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రసిద్ధ ‘బాల్మోరల్ షో’లో ‘జింజర్ స్పైస్’‌ మూడుసార్లు విజేతగా నిలవడమే అందుకు కారణం. ఉత్తర ఐర్లాండ్‌లో జరిగే అతిపెద్ద అగ్రి-ఫుడ్ ఈవెంట్ ‘బాల్మోరల్ షో’ కాగా, ఇది ప్రతి ఏటా మే నెలలో లిస్బర్న్‌లోని బాల్మోరల్ పార్క్‌లో జరుగుతుంది. ఇందులో షోజంపింగ్ పోటీలు, మోటారుసైకిల్ ప్రదర్శనలతో పాటు గుర్రాలు, పశువులు, గొర్రెలు, కోళ్లు, పందులు మరియు మేకల పదర్శనలు జరుగుతాయి. 1855 సంవత్సరం నుంచి ఈ షో నిర్వహిస్తున్నారు.

‘ఈ వేలంలో పెంపకందారులకు మాత్రమే కాకుండా, లిమోసిన్ ఆవు జాతికి కూడా అద్భుతమైన విజయాన్ని అందించిన కొనుగోలుదారులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని బ్రిటిష్ లిమోసిన్ క్యాటిల్ సొసైటీ జాతి కార్యదర్శి విల్ కెట్లీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed