ఆర్థిక వృద్ధి మరింత కుదింపు : IMF

by Harish |
ఆర్థిక వృద్ధి మరింత కుదింపు : IMF
X

దిశ, వెబ్‌డెస్క్ :

కొవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్ నుంచి భారత్ క్రమంగా బయటపడుతున్న వేళ 2020-21 ఆర్థిక ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం కుదించుకుపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) మంగళవారం విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో పేర్కొంది. జూన్‌లో ఐఎంఎఫ్ వెల్లడించిన 4.5 శాతం ప్రతికూల వృద్ధి కంటే ఈసారి గణనీయంగా తగ్గుతుందని అంచనా వేసింది. ఈ పరిణామాలు కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల ఆర్థిక వృద్ధిపై కొనసాగుతున్న సవాళ్లను సూచిస్తాయని ఆ సంస్థ అభిప్రాయపడింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.8 శాతం వృద్ధితో అద్భుతమైన రికవరీని సాధిస్తుందని IMF అంచనా వేసింది. ప్రస్తుత సంవత్సరంలో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు సంకోచాన్ని చూస్తాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. అయితే, చైనా మాత్రమే సానుకూల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని ప్రకటించింది. అదేవిధంగా, 2020లో ప్రపంచ వృద్ధి 4.4 శాతం కుదించగలదని, 2021లో అంతర్జాతీయ ఉత్పత్తి 5.2 శాతం పెరుగుతుందని ఐఎంఎఫ్ వెల్లడించింది.

Advertisement

Next Story