కమలం పార్టీలో లుకలుకలు.. ‘సేవ్ బీజేపీ’ అంటున్న కార్పొరేటర్లు

by Shyam |   ( Updated:2023-05-19 08:15:46.0  )
కమలం పార్టీలో లుకలుకలు.. ‘సేవ్ బీజేపీ’ అంటున్న కార్పొరేటర్లు
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుద‌నే ప్రచారం సాగుతున్న త‌రుణంలో గ్రేట‌ర్‌లో ఆ పార్టీ ఆధిప‌త్య పోరు తారా స్థాయికి చేరుకుంటోంది. పార్టీకి విధేయుడిగా ఉంటూ బ‌లోపేతం కోసం ప‌ని చేసే నాయ‌కుల‌ను ప‌ద‌వుల నుంచి త‌ప్పించేందుకు ఓ వ‌ర్గం నేత‌లు ప్రయ‌త్నం చేస్తున్నార‌ని, ప‌ద‌వుల‌ను అమ్ముకుంటున్నారంటూ సొంత పార్టీ నేత‌లే ధ‌ర్నాకు దిగ‌డం సంచ‌ల‌నంగా మారింది. క‌ష్టప‌డి ప‌ని చేసే వారికి ప‌ద‌వులు ద‌క్కకుండా చేస్తున్నార‌ని ఆందోళ‌న‌ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేత‌ల‌పై రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేదని ఆవేద‌న చెందుతున్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో టీఆర్ఎస్ అధికార పార్టీని ఎదుర్కోవ‌డంలో క‌మ‌లం స‌క్సెస్ అవుతుంద‌ని అనుకునే సంద‌ర్భంలో బీజేపీ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ప‌ద‌వుల‌ను డ‌బ్బుల‌కు, బంధుప్రీతికి అమ్ముకుంటున్నార‌ని సొంత పార్టీ నేత‌లే ఆరోపిస్తున్నారు. ఈ విష‌యాన్ని రంగారెడ్డి జిల్లా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డంతో గ్రేట‌ర్ క‌మ‌లంలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి.

గ‌త ఏడాది జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ 48 డివిజ‌న్‌ల‌ను కైవ‌సం చేసుకుంది. దీంతో గ్రేట‌ర్ ప‌రిధిలో క‌మ‌లం తిరుగులేని శ‌క్తిగా ఎదిగింద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఈ త‌రుణంలో బీజేపీలో ఆధిప‌త్య పోరు భ‌విష్యత్తులో ఎటువంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందోన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. బీజేపీ ప్రాత‌నిథ్యం వ‌హిస్తున్న మెజారిటీ డివిజ‌న్లలో నేత‌ల మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ విష‌యంలో బీజేపీ అధిష్టానానికి ఫిర్యాధులు అందినా ప‌ట్టించుకోవ‌డ‌లేద‌ని సొంత పార్టీ నేత‌లే వాపోతున్నారు.

జిల్లా పార్టీ కార్యాల‌యం ముందు ధ‌ర్నా..

ఎల్బీన‌గ‌ర్‌లోని రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాల‌యం ముందు స‌రూర్‌న‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఆకుల శ్రీ‌వాణి అంజ‌న్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి శ‌నివారం ధ‌ర్నాకు దిగారు. సేవ్ బీజేపీ పార్టీ – సేవ్ స‌రూర్‌న‌గ‌ర్ డివిజ‌న్ అంటూ నినాదాలు చేశారు. మ‌హేశ్వరం నియోజ‌క‌వ‌ర్గం పార్టీ ఇంచార్జ్ అందెల శ్రీ‌రాములు యాద‌వ్, క‌న్వీన‌ర్ ధీర‌జ్‌రెడ్డిలు పార్టీలో క‌ష్టప‌డ్డ వారికి కాకుండా డ‌బ్బుల‌కు, బంధుప్రీతికి ప‌ద‌వుల‌ను అమ్ముకుంటున్నార‌ని ఆరోపించారు.

ధీర‌జ్‌రెడ్డి త‌న డివిజ‌న్ నాయ‌కులకు మ‌ద్యం తాగించి, తానే కార్పొరేట‌ర్‌ను అంటూ త‌నుకు వ్యతిరేకంగా ప‌ని చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష‌యం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. పార్టీ రాష్ట్ర అధిష్టానం క‌ల్పించుకొని పార్టీ క్యాడ‌ర్‌ను కాపాడాల‌ని కోరారు.


Advertisement

Next Story

Most Viewed