ప్రేగ్‌లో కరోనా వీడ్కోలు పార్టీ..

by Shamantha N |
ప్రేగ్‌లో కరోనా వీడ్కోలు పార్టీ..
X

ప్రపంచంవ్యాప్తంగా ఒక్కో దేశంలో కరోనా వెనక్కి తగ్గుతోంది. అయితే న్యూజిలాండ్ దేశం ‘కరోనా వైరస్ ఫ్రీ’ అని ప్రకటించిన రెండ్రోజులకే కొత్త కేసు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ జనాలు భయపడటం లేదు. ఇక చెక్ రిపబ్లిక్ దేశంలోనైతే పార్టీలకు, వేడుకలకు కూడా అనుమతినిస్తూ లాక్‌డౌన్‌కు సడలింపులివ్వడంతో ఒక పెద్ద ఫేర్‌వెల్ పార్టీ కూడా నిర్వహించారు. దీనికి ‘కరోనా వీడ్కోలు పార్టీ’ అని కూడా పేరు పెట్టారు. రాజధాని ప్రేగ్‌లో ఉన్న చారిత్రాత్మక చార్లెస్ బ్రిడ్జి మీద ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీని ‘ఒండ్రోజ్ కోబ్జా’ అనే ఒక స్థానిక కేఫ్ యజమాని నిర్వహించాడు.

కరోనా వైరస్ నుంచి తమ నగరం పూర్తిగా బయటపడిన కారణంగా తాను ఈ పార్టీ ఇస్తున్నట్లు ఒండ్రోజ్ అంటున్నారు. కరోనా విజృంభించిన సమయంలో ప్రజలు ఒకరితో ఒకరు కలవడానికి ఇబ్బంది పడ్డారు. కాగా ఈ వీడ్కోలు పార్టీ.. వారిలో ఉన్న ఇబ్బందిని పోగొడుతుందనేది ఒండ్రోజ్ అభిప్రాయం. ఈ పార్టీ కోసం చార్లెస్ బ్రిడ్జి మీద 500 మీటర్ల పొడవైన డైనింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. స్థానికులు తమ ఇంటి నుంచే భోజనం, డ్రింక్స్ తెచ్చుకుని పార్టీలో ఇతరులతో పంచుకోవాలి. ఇక్కడ సంగీత కచేరీలను కూడా ఒండ్రోజ్ ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం తమ నగరంలో టూరిస్టులు ఎక్కువగా లేకపోవడంతో ఈ పార్టీ నిర్వహణ సులభమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఈ పార్టీలో పాల్గొన్న వారు కనీసం మాస్క్ కాదు కదా.. సామాజిక దూరం కూడా పాటించకపోవడంతో న్యూజిలాండ్ లాంటి పరిస్థితే ఇక్కడా వస్తే, బాధ్యత ఎవరిదని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ ఈ విమర్శలేవీ పట్టించుకోకుండా ఆ వీడ్కోలు పార్టీని అందరూ ఎంజాయ్ చేయడం కొసమెరుపు.

Advertisement

Next Story

Most Viewed