ఎక్కడ చూసినా.. టు లెటే!

by Shyam |
ఎక్కడ చూసినా.. టు లెటే!
X

దిశ, న్యూస్ బ్యూరో : గతంలో హైదరాబాద్‌లో అద్దె ఇళ్లు దొరకాలంటే గల్లీలన్నీ జల్లెడ పట్టాల్సి వచ్చేది. కానీ నేడు కరోనా దెబ్బతో ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. ఎటుచూసినా టు లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇంటి రెంట్ తగ్గించినా అద్దెకు దిగివారు మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా ఇంటి లోన్లు, ఈఎంఐలు కట్టలేక ఓటర్లు పడరానిపాట్లు పడుతున్నారు. హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు నిర్వహించే కమర్షియల్ బిల్డింగ్‌ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. కరోనా ప్రభావంతో నగరం విలవిలలాడుతోంది. కరోనా వైరస్‌కు భయపడి బతుకు జీవుడా అంటూ అద్దె ఇళ్ళను ఖాళీచేసి సొంతూళ్ళకు వెళ్ళిపోయేవారు కొందరైతే, లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు ఊడి ఇంటిదారి పడుతున్నవారు మరికొందరు. దీంతో హైదరాబాద్ అంతా ఖాళీ అవుతోంది. కాలనీల్లోని గల్లీల్లో ఎటు చూసినా వందల సంఖ్యలో టు లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. అప్పో, సప్పో చేసి ఇల్లు కడితే అద్దెల మీదనే హైదరాబాద్‌లో హాయిగా బ్రతికేయవచ్చు అనేది ఒకప్పటి మాట. ప్రతీయేటా ఇంటి కిరాయిలు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విద్య, వ్యాపార కూడలిగా గుర్తింపు పొందిన దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో రోజువారీ కూలీ పనిచేసుకునేవారి మొదలు లక్ష రూపాయల ఉద్యోగం చేసుకునేవారి వరకు వారి ఆర్థిక హోదాకు తగ్గట్లు అద్దె ఇళ్లలో ఉండేవారు. కానీ ప్రస్తుతం కరోనా ప్రభావంతో వారికి ఉద్యోగాలు పోయాయి. ఇళ్ళు ఖాళీచేసి సొంతూళ్ళకు వెళ్ళిపోతున్నారు. అద్దె ఇళ్ళను చూసిపెట్టే బ్రోకర్లు కూడా ఇప్పుడు ఉపాధి కరువైంది. అలకాపురి, ఎస్‌బీఐ కాలనీ, టెలిపోన్ కాలనీ, ఆటో నగర్, వనస్థలిపురం, ఉప్పల్, బోడుప్పల్ తోపాటు నగరంలోన్ని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్లన్నీ ఖాళీ అయ్యాయి.

కమర్షియల్ బిల్డింగ్‌లది అదే పరిస్థతి..

దాదాపు మూడు నెలలుగా విద్యా సంస్థలు, కోచింగ్ సంస్థలు బంద్ కావడంతో విద్యార్ధులు, టీచర్లు ఇండ్లు, రూమ్‌లు, హాస్టళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దీంతో నగరంలోని కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఖాళీగా మారుతున్నాయి. దీంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో దిగులు చెందుతున్నారు. చిన్న ఇళ్ల నుంచి పెద్ద బిల్డింగ్స్ వరకు ఆయా బ్యాంకుల్లో లోన్లు తీసుకుని నిర్మించుకునేవారే ఎక్కువగా ఉంటారు. వారు వచ్చే అద్దెలపై ఆధారపడుతూ ఈఎంఐలు కడుతుంటారు. వారంతా ఇప్పుడు వాటిని చెల్లించేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు.

అద్దె అడిగే వారేలేరు: ముశం నరహరి, వనస్థలిపురం, శ్రీనగర్ కాలనీ

కరోనా ఎఫెక్టుతో రెంట్‌కు ఉన్నవారంతా ఇళ్లను ఖాళీ చేస్తున్నారు తప్ప కొత్తగా అద్దె అడిగేవారే లేరు. ఏడాది కిందనే రూ.20 లక్షల బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టాను. ఇంటి అద్దెతో బ్యాంక్ వాయిదాలు చెల్లిస్తున్న. ఇప్పుడు ఇల్లు ఖాళీ అయింది. రెంట్ తగ్గించి టు లెట్ బోర్డు పెట్టినా నెల నుంచి ఎవరూ రావడం లేదు. ఇప్పుడు లోన్ ఎలా కట్టాలో అర్థం కావడం లేదు.

Advertisement

Next Story

Most Viewed