- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ కంటే మర్డర్ కేస్ ఛేదనే నయం"
దిశ, న్యూస్ బ్యూరో: ”నా ముప్పై ఏళ్ళ అనుభవంలో ఎన్నో క్రిమినల్ కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేశాను. ఛాలెంజింగ్ కేసులెన్నింటినో ఛేదించాను. అంతుచిక్కని మర్డర్ కేసుల అంతుచూశాను. కానీ ఇప్పుడు కరోనా పాజిటివ్ పేషెంట్ల ప్రైమరీ, సెకండరీ కేసుల్ని ట్రేస్ చేయడం ఆ అనుభవానికే పరీక్ష పెడుతోంది” అని ఓ పోలీసు ఉన్నతాధికారి తాను ఎదుర్కొంటున్నసవాళ్ళ గురించి ‘దిశ’కు వివరించారు. ఒక్కరు పాజిటివ్ పేషెంట్‌గా నిర్ధారణ అయితే అప్పటివరకూ అతనితో ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల్ని కనిపెట్టడం పోలీసులకు ఒక సవాలుగా మారింది. పాజిటివ్‌గా నిర్ధారణ కావడానికి ముందు అతనికి వారం పది రోజుల ముందు నుంచి సంబంధంలో ఉన్నవారందరి వివరాలను సేకరించడం, మళ్ళీ ఆ ప్రైమరీ వ్యక్తులతో సంబంధం ఉన్నవారి ఆచూకీ కనుగొనడం ఒక ఛాలెంజింగ్ టాస్క్‌గా మారింది. పైకి చూడడానికి ఒక పాజిటివ్ కేసుకు సంబంధించినదిగానే కనిపిస్తున్నా దాని లింకుల ఆరా తీసి లాజికల్ ఎండ్ కనుగొనడానికి గంటలు, రోజులే కాదు వారాలు, నెలల సమయం పడుతోందని ప్రస్తుతం నగరంలోని ఒక కంటైన్‌మెంట్ క్లస్టర్‌లో అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న (పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) అధికారి వ్యాఖ్యానించారు.
కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసిన తర్వాత పోలీసు అధికారులపై పని భారం బాగా పెరిగిందని, ఒకచోట పాజిటివ్ కేసు వచ్చినట్లు సమాచారం రాగానే ఆ వ్యక్తి గడచిన పది రోజుల్లో ఎవరెవరిని కలిశారు, ఎక్కడ కలిశారు, ఎంతమందిని కలిశారు, ఏయే ప్రాంతాల్లో తిరిగారు.. ఇలా సర్వం సేకరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. “వారం పదిరోజుల్లోని వివరాలన్నీ ఒక్కోసారి ఆ వ్యక్తికి గుర్తుండకపోవచ్చు లేదా మర్చిపోయి ఉండొచ్చు లేదా ఉద్దేశపూర్వకంగానే కొన్ని బైటకు చెప్పకుండా దాచిపెట్టి ఉండొచ్చు. కానీ వాటన్నింటినీ సేకరించి ఒక క్రమపద్ధతిలో నివేదిక తయారుచేయాల్సి వస్తోంది. ఆ వ్యక్తితో ఉన్న చైన్ చివరి అంచు దాకా పూర్తి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి దగ్గరి నుంచి సేకరించిన వివరాలతోనే సరిపెట్టుకుంటే కొన్నిసార్లు లింకు దొరకదు. అందుకే ఆ వ్యక్తి వివరాలను సరిపోల్చుకునేందుకు ఆ ఫోన్ నెంబర్‌కు వచ్చిన కాల్ డేటా మొత్తాన్ని బైటకు తీస్తున్నాం. టెక్నాలజీ సాయంతో ఆ వ్యక్తి గత పది రోజుల్లో ఎక్కడెక్కడ తిరిగారో ఫుట్ మ్యాపింగ్‌ను వెలికి తీస్తున్నాం. ఆ వ్యక్తి చెప్పిన వివరాలను వీటితో సరిచూసుకుని కొన్ని సందేహాలను మళ్ళీ నివృత్తి చేసుకోవాల్సి వస్తోంది” అని వివరించారు.
అయితే ఈ పాజిటివ్ వ్యక్తి నుంచి ఈ వివరాలను తీసుకునేట్పపుడు తాము కూడా ఆ వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ వ్యక్తితో ఉన్న మొత్తం లింకులను కొలిక్కి తేవడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయలేమని, ఆ వ్యక్తి కదలికలను బట్టి సమయం పడుతుందని వివరించారు. కొద్దిమంది నాలుగైదు రోజుల పాటు కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్‌కు వెళ్ళినట్లు చెప్తారని, అయితే ఏయే దుకాణం అనే వివరాలు సరిగ్గా అందవని, మొబైల్ సిగ్నళ్ళు కూడా ఒకే టవర్ కిందికి వస్తాయి కాబట్టి నిశితంగా వివరాలు రాబట్టడం కష్టమేనన్నారు. మార్కెట్‌కు వెళ్ళినప్పుడు ఎంత మందికి అంటుకుందో అనే అనుమానంతోనే విచారణ చేపడతామని, అక్కడ తీసుకుంటున్న జాగ్రత్త చర్యలకు అనుగుణంగా తీవ్రతను అంచనా వేస్తామని తెలిపారు. నిర్దిష్టంగా ఒక వ్యక్తికి సంబంధించిన మొత్తం వివరాలను సేకరించేలోపే మళ్ళీ రెండో కేసు వస్తుందని, ఏక కాలంలో ఆ విధంగా అనేక కేసుల్ని చూడాల్సి వస్తోందని, అందుకోసం ఎక్కడెక్కడికో తిరగాల్సి వస్తోందని, ఇంటి దగ్గర ఉన్నా డ్యూటీలో ఉన్నలాంటి పనులు తప్పడంలేదన్నారు.
మరోవైపు నిర్దిష్టంగా ఒక పాజిటివ్ పేషెంట్‌కు ప్రైమరీ కాంటాక్టులో ఉన్నసెకండరీ వ్యక్తుల వివరాలను సేకరించడానికి వారి ఫోన్ నెంబర్లను, కాల్ డేటాను, సెల్‌ఫోన్ టవర్ల సిగ్నళ్ళను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైమరీ వ్యక్తుల కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు… ఇలాంటి వివరాలన్నీ రాబట్టడం ఒక ఎత్తయితే, ఆ వివరాల ఆధారంగా క్వారంటైన్‌కు పంపాల్సి వస్తే వారిలో ఆందోళన రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి రావడం మరొక ఎత్తు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వారంటైన్ అనగానే పాజిటివ్ వచ్చేసిందన్న తీరులో ఆలోచనలు ఉంటున్నాయని, దీనివల్ల సోషల్ డెస్టెన్స్ సంగతేమోగానీ వారితో మాట్లాడడానికి, వారి ఇంటివైపు చూడడానికి కూడా చాలా మంది సాహసించడంలేదని, ఒక రకంగా ఇది సోషల్ బాయ్ కాట్ లాగా తయారైందని, అందువల్లనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు.
నిజానికి ఒక మర్డర్ కేసును ఛేదించడానికి సంఘటనా స్థంలో ఏదో ఒక చిన్న క్లూ దొరుకుతుందని, అదే కేసు మొత్తానికి కీలకంగా మారవచ్చని, కానీ కరోనా కేసుల విషయంలో మాత్రం ఎన్నో క్లూలు దొరికినట్లు అనిపించినా వాటి లోతు తెలుసుకోవడం, ఆ చైన్ ఎక్కడిదాగా ఉందో అంచు వరకూ వెళ్ళడం నిజంగా పోలీసులకు ఒక పరీక్ష లాంటిదని వ్యాఖ్యానించారు. పాజిటివ్ వ్యక్తిని కలిసినవారందరికీ పాజిటివ్ ఉందనే అంచనాకు రాలేమని, కానీ లక్షణాలు లేకున్నా కొన్నిచోట్ల పాజిటివ్ పేషెంట్లుగా మారుతున్నారన్నారు. విచారణ బాధ్యతలు తీసుకున్న ఒక్క పోలీసు అధికారి వల్ల మాత్రమే ఈ లింకులన్నింటినీ పట్టుకోవడం సాధ్యం కాదని, రాష్ట్ర స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసుల కృషి చాలా ఉందని, సమిష్టిగానే ఫలితాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కానంతవరకు ట్రేసింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సూర్యాపేట లాంటి పట్టణంలో ఒక్క వ్యక్తి ద్వారా ఎంతమందికి అంటుకుందో చూశామని, ఆ వ్యక్తిని కేంద్రంగా చేసుకుని మొత్తం లింకులను ఛేదించిన తర్వాత ఎందుకు వైరస్ వేగంగా వ్యాపించిందో అర్థమైందని, వాటి వివరాల ఆధారంగానే పోలీసులు ‘ట్రీ స్ట్రక్చర్’ని రూపొందించగలిగారని ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక్కోచోట ఒక్కో రకమైన అనుభవం ఉంటుందని, ఎంత లోతుగా ఆరా తీసినా కొన్నిచోట్ల గ్యాప్‌లు ఉంటూనే ఉన్నాయని, వాటి కోసం బుర్రకు మరింత పదును పెట్టాల్సి వస్తోందని తెలిపారు. ఒక పాజిటివ్ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఫలానా ప్రాంతానికి వెళ్ళినప్పటికీ దాన్ని తొక్కిపెడుతున్నారని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాస్తవం వెలుగులోకి వస్తున్నా ఆ వ్యక్తుల్ని ట్రేస్ చేయడం వీలుకావడంలేదన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ లింకులో ఏర్పడిన ఖాళీ ఫలితం ఇదేనా అనే స్పష్టత వస్తోందని వివరంచారు.
కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళిన కేసుల లింకులు ఉన్నాయన్నారు. అలాంటప్పుడు ఆ వ్యక్తి కదలికలను ఇతర జిల్లాల్లోని పోలీసులు కూడా లోతుగా పరిశీలించి వెలికి తీయాల్సి వస్తోందని తెలిపారు. మర్డర్ కేసులు కొన్ని రోజులు, వారాల వ్యవధిలో కొలిక్కి వచ్చినా కరోనా కేసులు మాత్రం నిజంగా తమ పోలీసు అనుభవానికి, సామర్థ్యానికి పరీక్ష పెడుతున్నాయన్నారు.
Tags: Telangana, Corona, Positive, Tracing, primary, Secondary, Police, Intelligence, Special Branch