- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WTC final: ఐసీసీ ఫైనల్ మరోసారి వివాదాస్పదం.?
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సాధారణంగా వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తుంటుంది. దీంతో పాటే చాంపియన్స్ లీగ్ కూడా నిర్వహిస్తున్నది. ఇవన్నీ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సంబంధించిన టోర్నీలే. వన్డే వరల్డ్ కప్ నాలుగేళ్లకు ఒకసారి, టీ20 వరల్డ్ కప్ రెండేళ్లకు ఒకసారి నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా టీ20 వరల్డ్ కప్ వాయిదా పడుతూ వస్తున్నది. అయితే వన్డే వరల్డ్ కప్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నది. ఇక క్రికెట్‌లో సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో మాత్రం ప్రపంచ విజేతను నిర్ణయించడానికి కేవలం ఐసీసీ ర్యాంకింగ్స్ మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఏడాది చివర్లో ఎవరైతే అత్యధిక పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంటారో ఆ జట్టును టెస్ట్ క్రికెట్‌లో విజేతగా ప్రకటిస్తున్నారు. కానీ దీనికంటూ ఏనాడు ప్రత్యేకంగా మ్యాచ్‌లు నిర్వహించలేదు. వన్డే, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించడం సులభమే. ఏదో ఒక దేశంలో నెల లేదా నెలన్నర వ్యవధిలో మ్యాచ్‌లు ముగించే అవకాశం ఉన్నది. కానీ టెస్ట్ చాంపియన్ షిప్ విషయంలో మాత్రం అలా కుదరదు. ఎందుకంటే ఒక్కో మ్యాచ్ కోసమే ఐదు రోజుల సమయం కేటాయించాలి కాబట్టి ప్రపంచ కప్ కోసం కొన్ని నెలలు ప్రత్యేకంగా పక్కన పెట్టాలి.
ద్వైపాక్షిక సిరీస్ ఫార్మాట్..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం ప్రత్యేకంగా మ్యాచ్‌లు నిర్వహించాల్సిన అవసరం లేకుండా ఐసీసీ ప్రత్యేక ఫార్మాట్ రూపొందించింది. 2019-2021 మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లనే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చేర్చింది. ప్రతీ టెస్టును ఒక లీగ్ మ్యాచ్‌గా నిర్ణయించింది. 2019 ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన యాషెస్ నుంచే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్లను లెక్కపెట్టడం మొదలు పెట్టారు. ఒక్కో సిరీస్‌లో ఆడే మ్యాచ్‌ల సంఖ్యను బట్టి పాయింట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఒక సిరీస్‌కు 120 పాయింట్లను కేటాయించారు. ఆ సిరీస్‌లో ఆడే మ్యాచ్‌లను బట్టి ఆ 120 పాయింట్లను విభజించారు. ఒక సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడితే ఒక్కో మ్యాచ్‌కు 24 పాయింట్లు కేటాయించారు. గెలిచిన జట్టుకు 24 పాయింట్లు ఇస్తారు. డ్రా అయితే ఒక్కో జట్టుకు 12 పాయింట్లు లభిస్తాయి.
ఇలా 2021 ఫిబ్రవరి చివరి నాటికి టాప్ 2 స్థానాల్లో ఉన్న జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే 2020లో కరోనా కారణంగా పలు ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయ్యాయి. దీంతో ఆడిన మ్యాచ్‌ల పరంగా కాకుండా గెలుపు శాతాల ఆధారంగా ఫైనల్స్‌కు చేరే జట్లను నిర్ణయిస్తామని ఐసీసీ చెప్పింది. ఐసీసీ అసలు ఏ క్రికెట్ బోర్డును కూడా సంప్రదించకుండా అకస్మాత్తుగా అర్హత నియమాలను మార్చేయడంతో అన్ని క్రికెట్ బోర్డులు వ్యతిరేకించాయి. కానీ ఐసీసీ మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఐసీసీ నిర్ణయంతో టేబుల్ టాపర్‌గా ఉన్న టీమ్ ఇండియా ఒక్కసారిగా మూడో స్థానానికి పడిపోయింది. అంతే కాకుండా న్యూజీలాండ్ జట్టు ముందుగానే ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.
మరో వివాదం..
ద్వైపాక్షిక సిరీస్‌లలో గెలుపు ఆధారంగా కాకుండా మొత్తానికి సాధించిన విజయాల శాతం ఆధారంగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కేటాయింపు జరపాలని ఐసీసీ నిర్ణయించడంతో న్యూజీలాండ్ రెండో స్థానం కన్ఫార్మ్ చేసుకొని వెళ్లిపోయాయి. అయితే ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తొలి స్థానం కోసం చివరి వరకు పోరాడాయి. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 3-1తో గెలుచుకొని ఇండియా టేబుల్ టాపర్‌గా నిలవడమే కాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నది. ఐసీసీ నిర్ణయించిన డబ్ల్యూటీసీ పాయింట్ల విధానంపై మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. స్వదేశంలో ఆడే మ్యాచ్‌లకు, విదేశాల్లో ఆడే మ్యాచ్‌లకు ఓకేలా పాయింట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. న్యూజీలాండ్ గెలిచిన మ్యాచ్‌లు స్వదేశంలోనే జరిగాయి. ఇండియా స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గెలిచింది. మరోవైపు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు కొన్ని సిరీస్‌లు కరోనా కారణంగా రద్దు చేసుకోవడంతో వెనుక పడ్డాయి. తాజాగా ఇండియా, న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌పై కూడా వివాదం మొదలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఆరు రోజులు జరపాలని ఐసీపీ నిర్ణయించింది. అయితే ఫలితం తేలే వరకు మ్యాచ్ నిర్వహిస్తారా? లేదంటే మ్యాచ్ సమయంలో ఏర్పడిన ఆటంకాలా సమయాన్ని ఆరో రోజుకు బదిలీ చేస్తారా అనే సందిగ్దం నెలకొన్నది.
సాధారణంగా పరిమిత ఓవర్ల మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్‌ను ఆశ్రయించారు. అది కూడా టై కావడంతో బౌండరీల లెక్క ద్వారా ఇంగ్లాండ్ జట్టును విజేతగా నిర్ణయించారు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టెస్టు మ్యాచ్ డ్రా అయితే ఏ జట్టును విజేతగా నిర్ణయిస్తారనే సందిగ్దత నెలకొన్నది. ఒక వేళ మ్యాచ్ డ్రా అయితే ఆరో రోజు పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడిస్తారా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఐసీసీ ఫైనల్ మరో సారి వివాదానికి దారి తీయడం చర్చనీయాంశంగా మారింది.