సచివాలయ నిర్మాణం సాధ్యంకాదంట

by Shyam |   ( Updated:2020-08-28 22:07:47.0  )
సచివాలయ నిర్మాణం సాధ్యంకాదంట
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న నూతన సచివాలయంపై రోడ్లు భవనాల శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఒకవైపు కూల్చివేత పనులను పర్యవేక్షిస్తూనే మరోవైపు కొత్త సచివాలయం నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియపై దృష్టి పెట్టింది. వచ్చే వారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదని వ్యాఖ్యానించిన ఒక అధికారి పౌర విమానయాన శాఖ నుంచి ఇప్పటికే అనుమతి వచ్చేసిందని వివరించారు. కొత్త సచివాలయానికి ఇది తప్ప మిగిలిన అనుమతులన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శాఖల నుంచి వస్తే సరిపోతుందని, నాలుగైదు రోజుల్లో అవి కూడా వస్తాయని వివరించారు. ఆ అనుమతుల కోసమే టెండర్ నోటిఫికేషన్‌ను ఆపినట్లు తెలిపారు.

బేగంపేట విమానాశ్రయంలో ఇప్పటికీ విమానాల రాకపోకలు జరుగుతున్నందున ఎయిర్ ట్రాఫిక్ రాడార్ సిగ్నళ్లకు, విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, దాన్ని దరఖాస్తు చేసుకున్న తర్వాత బృందం వచ్చి పరిశీలించి వెళ్లిందని, ఆ తర్వాత అనుమతి కూడా మంజూరైందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు మాత్రం అవసరమైనా నగరంలోనే ఉన్న టీఎస్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్స్ అసెస్‌మెంట్ అథారిటీ దాన్ని మంజూరు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక రావాల్సిన అనుమతులేవీ లేవని ఆ అధికారి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాలుష్య నియంత్రణ మండలి, భవన నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి బిల్డింగ్ ప్లాన్ క్లియరెన్స్, జలమండలి, హెచ్ఎండీఏ, ఫైర్ తదితర కొన్ని అనుమతులు నాలుగైదు రోజుల్లో వస్తాయని, అవి వచ్చిన వెంటనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. అనుమతులు రాకుండా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే ఆపి ఉంచినట్లు తెలిపారు. టెండర్ ఖరారు ప్రక్రియ మూడు వారాల్లో ముగుస్తుందని, ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలుపెట్టడమే తరువాయి అని ఆ శాఖకు చెందిన మరో అధికారి పేర్కొన్నారు.

పది నెలల వ్యవధిలోనే మొత్తం నిర్మాణాన్ని పూర్తిచేసి అధికారికంగా ప్రారంభోత్సవం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఏయే దశల్లో పనులు ఏ తరహాలో జరగాలో కూడా రోడ్లు భవనాల శాఖ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షణ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సూపరింటెండింగ్ ఇంజినీర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష జరపనుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విభాగాల నుంచి సత్వరం అనుమతులు లభించేలా అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా జరుగుతోంది. చెరువుల పరిరక్షణ చట్టం, వాల్టా చట్టం, పర్యావరణ ప్రభావం అంచనా, రెవిన్యూ చట్టం, ఇరిగేషన్ చట్టం లాంటి వాటిల్లోని అంశాలపై ఎక్కడా లీగల్ చిక్కులు లేకుండా న్యాయశాఖ సిబ్బంది కూడా రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేస్తోంది.

హైకోర్టులో విచారణ జరుగుతుండగా నిర్మాణం సాధ్యం కాదు : లుబ్నా సర్వత్

సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల శాశ్వత కట్టడాలు (సిమెంటు కాంక్రీట్) చేపట్టడానికి వీలు లేదని, హైకోర్టులో ఇప్పటికీ ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉందని ‘సౌల్’ (సేవ్ అవర్ అర్బన్ లేక్స్) అనే స్వచ్ఛంద సంస్థ తరపున కేసు వేసిన లుబ్నా సర్వత్ ‘దిశ’కు వివరించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ 2006లో రూపొందించిన ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ నోటిఫికేషన్ ప్రకారం 20 వేల చదరపు మీటర్ల మేర నిర్మించే కట్టడానికి తప్పకుండా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ నుంచి పర్యావరణ అనుమతి పొందాల్సిందేనని, అది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాన్ని నిర్మించడం ఉల్లంఘన అవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది జూన్ 17న సీఎం కేసీఆర్ భూమి పూజ చేయడమంటేనే కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రారంభం చేయడమని, ఆ ప్రకారం అప్పటికే ఈ అనుమతులన్నీ వచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కానీ పాత సచివాలయాన్ని కూల్చివేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో తాను దాఖలు చేసిన పిటిషన్‌కు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉందని, హుస్సేన్ సాగర్ సమీపంలో ఇంత భారీ నిర్మాణం చేపట్టడానికి అనుమతి లేకుండానే పనులు చేపట్టడం నేరమన్నారు.

Advertisement

Next Story

Most Viewed