పసుపు రైతులకు మద్దతుగా దీక్ష చేస్తా : జీవన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-01-25 09:49:24.0  )
పసుపు రైతులకు మద్దతుగా దీక్ష చేస్తా : జీవన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని, పంట రుణాల మాఫీ చేయకపోవడం దారుణమని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రైతులకు కేవలం రూ.25 వేల లోపు పంట రుణాలను మాత్రమే మాఫీ చేశారని, మిగిలిన వాటిపై నిర్ణయం తీసుకోవడం లేదని మండిపడ్డారు. రైతుబంధు పేరుతో రైతులకు అందే ప్రయోజనాలన్నీ కట్​ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో విత్తన రాయితీ పూర్తిగా కనుమరుగు చేశారని, వ్యవసాయ యాంత్రీకరణ నిలిపివేశారని, ఉద్యానవిభాగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని జీవన్​రెడ్డి విమర్శించారు.

ఉద్యానవన శాఖలో వేతనాలు చెల్లించే పరిస్థితి లేకుండా 459 మందిని తొలగించారని, రాష్ట్ర ప్రభుత్వం కనీసం కేంద్ర నిధులను కూడా సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. పంట రుణాలపై వడ్డీ రాయితీని ఎత్తివేశారని, రుణమాఫీ, రైతుబంధుపై స్పష్టత లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పసుపు రైతులకు కనీస మద్దతు ధర లేదని, పసుపు రైతులకు సంఘీభావంగా ఈ నెల 30న ఆర్మూర్​లో ఒక్కరోజు దీక్ష చేస్తున్నట్లు జీవన్​రెడ్డి ప్రకటించారు.

Advertisement

Next Story