వరి వద్దన్నారు.. కాళేశ్వరం నీళ్లతో ఏ పంట వేయాలి : ప్రశ్నించిన కాంగ్రెస్ నేత

by Shyam |
వరి వద్దన్నారు.. కాళేశ్వరం నీళ్లతో ఏ పంట వేయాలి : ప్రశ్నించిన కాంగ్రెస్ నేత
X

దిశ, హుస్నాబాద్ : లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో ఏ పంట పండించాలో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మంద ధర్మయ్య అన్నారు. మంగళవారం కోహెడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మిడ్ మానేర్‌, పలు ప్రాజెక్టుల నీటితో రాష్ట్రంలోని లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చామని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే, నేడు వరి పంటసాగు చేస్తే ఉరే అనడం సిగ్గుచేటు అని విమర్శించారు. కేసీఆర్ ప్రకటనతో రాష్ట్ర రైతాంగం ఆందోళనలో పడిపోయిందన్నారు మండిపడ్డారు.

కలెక్టర్‌ను సీఎం, హరీష్ నడిపిస్తున్నారా..?

సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంట్రామిరెడ్డి వెనుక ఉండి ఆయనను నడిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మంద ధర్మయ్య, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బద్దిపడగ జైపాల్ రెడ్డి ఆరోపించారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ హోదాను మరిచిపోయి, కోర్టులకు, చట్టాలకు విలువ లేకుండా రైతుల మనోభావాలు దెబ్బతిశారని మండిపడ్డారు.

కలెక్టర్ మాటలకు వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కూలీల కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా వారి మనోభావాలు దెబ్బతిసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోకుంటే అన్నదాతలతో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజుల వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు దూలం శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు చింతకింది శంకర్, చిట్యాల రాయమల్లు, బూర స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story