అప్పారావు తొలగింపు.. యూనివర్సిటీకి పీడ వదిలింది : దాసోజు

by Shyam |
అప్పారావు తొలగింపు.. యూనివర్సిటీకి పీడ వదిలింది : దాసోజు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ పొదిలె అప్పారావు తొలగింపుతో యూనివర్సిటీకి పట్టిన పీడ వదిలిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పారావు తొలగింపుతో యూనివర్సిటీలో అణిచివేత, అధికార దుర్వినియోగానికి చరమగీతం పాడినట్లయిందని పేర్కొన్నారు. హెచ్‌సీయూ వీసీ పదవి నుంచి ప్రొఫెసర్ అప్పారావును తొలగించడం, అమరవీరుడు దళిత విద్యార్ధి రోహిత్ వేములకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న మద్దతుదారుల విజయమన్నారు. అప్పారావు హయంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు అప్పారావే కారణమని, విద్యార్ధులంతా రాజీనామాకు డిమాండ్ చేసినప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్కరే రోహిత్‌కి మద్దతుగా న్యాయం కోసం పోరాడారని పునరుద్ఘాటించారు. అప్పారావు హయంలో హెచ్‌సీయూ ప్రగతి కుంటుపడిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులను అణిచివేయడమే లక్ష్యంగా చేసుకొని, ప్రశ్నించిన విద్యార్ధులు, అధ్యాపకులు, బోధనేతర సభ్యులను మానసిక వేదనకు గురిచేశారని, క్రమ శిక్షణని బోధించాల్సిన వ్యక్తి కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు.

HCUలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అప్పారావు వీసీ స్థానంలో ప్రోత్సహించారని, రిజర్వేషన్లను తుంగలో తొక్కారని, రోస్టర్ పాయింట్స్ విధానాన్ని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. స్వప్రయోజనాలు కోసం అర్హత లేని వారికి ప్రమోషన్లు, తన వర్గం వారిని ప్రోత్సహించడం, తెలంగాణ బిడ్డలకు కాకుండా స్థానికేతరులకు ప్రాధాన్యం, వెనుకబడిన వర్గాల విద్యార్ధుల అవకాశాలను మరొకరికి అందేలా కుట్రచేశారన్నారు. ఈ అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలని దాసోజు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story