అకాల వర్షాలు.. ఆందోళనలో రైతులు

by Anukaran |
అకాల వర్షాలు.. ఆందోళనలో రైతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 6, 7 తేదీల్లో రాష్ట్రంలో పలుచోట్ల ముసురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల 6న సూర్యపేట జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టతను ఇవ్వలేదు. ఇప్పటికే కోతలు మొదలు పెట్టిన రైతులకు అకాలవర్షాల భయం పట్టుకుంది. వర్షాలు కురిస్తే పంట నష్టపోతామని ఆందోళనతో ప్రైవేటు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఈ యాసంగిలో 1.35కోట్ల మెట్రిక్ టన్నలు ధాన్యం దిగుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుండగా మద్దతు ధరను రూ.1888 లను వర్తింపజేస్తున్నారు.

రాష్ట్రంలో సాధారణ వరిసాగు విస్తీర్ణం 22.19లక్షల ఎరాలుండగా 50.49లక్షల ఎకారాల్లో 27.12లక్షల మంది రైతులు వరి సాగును చేపట్టారు. యాసంగిలో మొత్తం సాగు విస్తీర్ణం 65.32 ఉండగా దాదాపుగా 90శాతం మంది రైతులు వరిసాగు చేశారు. దేశంలో అత్యధికంగా వరి సాగును చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సాగు విస్తీర్ణం ప్రకారం 1.35కోట్ల మెట్రిక్ టన్నలు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది యాసంగిలో 26.97లక్షల ఎకరాల్లో వరి సాగు చేపపట్టగా దాదాపుగా 51లక్షల మెట్రిక్ ధాన్యం దిగుబడి వచ్చింది.

ఈ నెల 6 నుంచి కొనుగోలు కేంద్రాలు..

ఈ నెల 6న సూర్యపేట జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 6000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాని రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారనే అంశంపై అయోమయం నెలకొంది. కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై జిల్లా అధికారులకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారనే అంశాలను ప్రభుత్వం వెల్లడించలేదు.

రైతులకు అకాల వర్షాల భయం

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రైతులు వరికోతలను ప్రారంభించారు. కూలీల కొరత ఏర్పడటంతో వేగంగా కోతలు పూర్తి చేసేందుకు చాలా వరకు రైతులు హార్వెస్టర్లను ఆశ్రయించి కోతలను పూర్తి చేస్తున్నారు. అయితే ఈ నెల 6, 7 తేదీల్లో ముసురు వర్షం పడే అవకాశాలున్నాయని వాతవరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వర్షాలు కరిస్తే పంటలను ఎక్కడ నిలువ చేసుకోవలనే సందిగ్దత మొదలైంది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏ తేదీన ప్రారంభించనున్నారో ఇప్పటి వరకు ప్రకటించలేదు. అకాల వర్షాలు కురిసే అవకాశాలుండటంతో సాధ్యమైనంత తొందరగా కొనుగోలు కేంద్రాలను రాష్ట్రమంతటా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐకేపీ సెంటర్లను, మార్కెట్ యార్డ్ లను ఎక్కడెక్కడ ప్రారంభిస్తారో ప్రకటించాలని కోరుతున్నారు. అవసరమైనన్ని గన్నీ బ్యాగులను సరఫరా చేసి అకాల వర్షాల నుంచి పంటలను కాపాడాలని కోరుతున్నారు.

దళారులను ఆశ్రయిస్తున్న రైతులు..

నిజామాబాద్ , సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే వరి కోతలు పూర్తి చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు పంటలను విక్రయిస్తున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని అధికంగా సాగుచేసిన రైతులు అకాల వర్షాలకు బయపడి ప్రైవేటు వ్యాపారులకు త్వరితగతిన పంటలను విక్రయించేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే రైతులు తక్కవ ధరలకు పంటలను విక్రయించి నష్టపోయే ప్రమాదముంది. ధాన్యం తాలు, పొల్లు లేకుండా ఎండబోసి 17శాతం కంటే తక్కవ తేమ కలిగి ఉంటే వరి ఏ గ్రేడ్ రకానికి రూ.18000, బిగ్రేడ్ రకానికి రూ.1868 మద్దతును ధరను వర్తిపజేయనున్నారు.

Advertisement

Next Story