‘మాస్కుల కొను‘గోల్‌మాల్‌’పై దర్యాప్తు చేయించండి’

by Shyam |
‘మాస్కుల కొను‘గోల్‌మాల్‌’పై దర్యాప్తు చేయించండి’
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కష్టకాలంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా ఆర్థిక అవకతవకలకు పాల్పడిన టీఎస్ఎంఎస్ఐడీసీ (తెలంగాణ రాష్ట్ర వైద్య సరఫరాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) సిబ్బందిపై గవర్నర్‌కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఉద్దేశపూర్వకంగా అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే మాస్కులు, శానిటైజర్లు, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్లు సంస్థలోని సిబ్బంది పర్చేస్ ఆర్డర్లు ఇచ్చారని, కమీషన్ల రూపంలో భారీ స్థాయిలో అందుకున్నారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఒక న్యాయవాది గవర్నర్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇందుకు చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.

టీఎస్ఎంఎస్ఐడీసీలోని ఒకరిద్దరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే అనుకూలంగా ఉండే వ్యక్తులకు, సంస్థలకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారని, ఎక్కువ ధరలు ఉండేలా కొటేషన్లు తెప్పించుకున్నారని, చివరకు ఉపకరణాలను సమకూర్చే విధంగా వారికే పర్చేస్ ఆర్డర్లు జారీ చేశారని ఆ విజ్ఞప్తి పత్రంలో పేర్కొన్నారు. ఇందుకుగాను సరఫరా చేసే సంస్థల నుంచి కమిషన్ల రూపంలో కొంత పర్సెంటేజీలను పొందారని పేర్కొన్నారు. ఈ కొనుగోళ్ళకు సంబంధించి ఆ వ్యక్తులకు వెంటవెంటనే బిల్లుల చెల్లింపులు కూడా జరిగిపోయాయని వివరించారు. ఒకవేళ వారు ముందుగా అనుకున్న ప్రకారం పర్సెంటేజీ ఇవ్వకపోతే తదుపరి కొనుగోలుకు అవకాశం లేకుండా చేశారని కూడా ఆరోపించారు. ఈ రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చేలా ఈ సిబ్బంది వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ సిబ్బందిలో ఒకరు రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ కార్యాలయం నుంచి గతేడాది డిప్యూటేషన్ మీద వెళ్ళగా మరొకరు ఆ సంస్థ ఉన్నత పదవిలో ఉన్నవారిలో సన్నిహిత సంబంధాలు కలిగినవారని గవర్నర్‌కు వివరించారు. ఈ అవకతవకలకు సంబంధించి దిశ పత్రికతో పాటు మరో తెలుగు పత్రికలో వచ్చిన వార్తలను కూడా గవర్నర్‌కు సమర్పించిన విజ్ఞాపనపత్రంతో జతపర్చారు.

Advertisement

Next Story

Most Viewed