ఎన్నికల వేళ ఈటలకు భారీ షాక్.. మరో స్కాం ఉచ్చులో మాజీ మంత్రి

by Anukaran |   ( Updated:2021-10-12 05:46:38.0  )
etala rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్ సివిల్ సప్లై శాఖలో 2 వేల కోట్ల స్కామ్ చేశారని, దానిపై సీబీఐ విచారణ చేయాలని విజయలక్ష్మి ఆగ్రో నిర్వాహకురాలు కన్న శివకుమారి కోరారు. హైదరాబాద్‌లో సివిల్ సప్లై కమిషనర్‌కు మంగళవారం ఆమె ఫిర్యాదు చేసింది. పలు అంశాల్లో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 2011 నుంచి విజయలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీ నడిపిస్తున్నానని, అప్పటి నుండి రేషన్ షాప్‌లకు కంది పప్పు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రేషన్ షాప్‌లకు కంది పప్పు సప్లై చేయడానికి టెండర్లు వేశానని, ఏపీలో హుదూద్ తుఫాన్ రావడంతో కంది పప్పు సప్లైలో కొంత ఆలస్యమైందన్నారు. ఆ తరుణంలో మాకు కాదని ఇతరులకు టెండర్ల ద్వారా కేటాయింపు చేశారని ఆరోపించారు. దీంతో తీవ్రంగా నష్టపోయామని, బ్యాంక్‌ల్లో తీసుకున్న అప్పులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Shivakumari

కోటి 97 లక్షల 57 వేలు చెల్లించి టెండర్‌లో పాల్గొన్నామని.. అయినా రాజేందర్ మమ్ములను బ్లాక్ లిస్టులో పెట్టి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. మాకు అన్యాయం చేసి మిగతా వారికి రీ టెండర్ ఇవ్వడంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. ఆడవాళ్లని చూడకుండా మమ్ములను బ్రోకర్ అని సంభోదించి నానా మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఒక్కరికే కాదు.. ఆయన అనేక అక్రమాలు చేశారని వాటన్నింటి పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మరోసారి సీఎస్, సీఎం కేసీఆర్‌ను కలుస్తానని, మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story