MLC కోసం టీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ.. ‘కారు’లో సీటు ఎవరికో.?

by Anukaran |
MLC కోసం టీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ.. ‘కారు’లో సీటు ఎవరికో.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోలాహలం మొదలైంది. నిన్నటిదాకా హుజురాబాద్​ఉప ఎన్నిక సందడి నెలకొనగా.. తాజాగా మండలి ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మండలి సభ్యుల ఎన్నికకు ఈసీ గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది. నవంబర్ 9న నోటిఫికేషన్​రానుండగా.. అదే నెల 29న పోలింగ్, కౌంటింగ్ జరుగనుంది. ఈ ఏడాది జూన్ 3న తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు, ఏపీలో ఈ ఏడాది మే 31న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కాగా, కరోనా వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేశారు.

అధికార పార్టీ కోటాలోనే..!

రాష్ట్రంలో ఆకుల లలిత, ఫరీజుద్దీన్, గుత్తా సుఖేందర్​రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడికుంట్ల వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. ఇవన్నీ టీఆర్‌ఎస్ కోటాలోనివే. ప్రస్తుతం ఈ స్థానాలను దక్కించుకునే బలం కూడా మళ్లీ టీఆర్‌ఎస్‌కే ఉంటోంది. దీంతో టీఆర్‌ఎస్​ ఖాతాలోనే ఈ స్థానాలు చేరుతున్నప్పటికీ.. పదవులు ఎవరికి దక్కుతాయోనన్న సందిగ్థత నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాల కోసం చాలా మంది అధినేత దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈసారి గుత్తా సుఖేందర్​రెడ్డి, ఆకుల లలితకు మళ్లీ అవకాశం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు.

అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా టికెట్ కోసం పోటీ పడిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ప్రకటించుకున్నారు. దీని ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నేతి విద్యాసాగర్‌కు ఈసారి అనుమానమే. ఇక హుజురాబాద్​రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య టీఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్​రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కేబినెట్​ తీర్మానం చేసి పంపినట్లు అధికారికంగానే ప్రకటించారు. కానీ ఇది పెండింగ్‌లో పడింది.

ఇదే సమయంలో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఇనుగాల పెద్దిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీనికితోడుగా ఉమ్మడి వరంగల్​జిల్లా నుంచి కడియం శ్రీహరికి ఈసారి అవకాశం వస్తుందా.. లేదా అనేదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దళిత సామాజికవర్గం నుంచి కడియం శ్రీహరికి చాన్స్ ఉంటుందని పార్టీ నేతల్లో కొంత ప్రచారం ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఇవ్వరని కూడా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల పార్టీలో చేరిన మరో నేతకు కూడా అవకాశం కల్పిస్తారని టాక్.

నవంబర్ 9 నుంచి నోటిఫికేషన్..​

ఎమ్మెల్సీ స్థానాలకు రెండు రాష్ట్రాల్లో వచ్చేనెల 9న నోటిఫికేషన్ జారీ కానుంది. అదేనెల 16 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. 17న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణలకు అవకాశం ఉంటోంది. 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ ఉండగా.. అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఉండనుంది. డిసెంబర్ 1 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed