కాళేశ్వరం ముంపు బాధితులు ఇప్పుడు గుర్తొచ్చారా..!

by Anukaran |
కాళేశ్వరం ముంపు బాధితులు ఇప్పుడు గుర్తొచ్చారా..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సొమ్ము రైతులది.. సోకు సర్కార్‌దిగా మారిపోయింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కోతకు గురైన రైతుల భూముల్లో దశాబ్ధంగా ప్రభుత్వం ఇసుక క్వారీల ద్వారా ఆదాయం పొందింది. టెండర్లను పిలిచి మరీ ఇసుక రీచ్‌లకు అనుమతి ఇచ్చింది. గత ఐదేళ్లలో రీచ్‌ల ద్వారా ఏటా రూ.800 కోట్లకు పైగా తన ఖాతాలో వేసుకుంది. ఇన్నాళ్లూ యథేచ్ఛగా ఇసుకు తోడేసిన సర్కార్ ఆ భూములు ఎవరివో కనీసం గుర్తించలేదు. బాధితుల ఊసే ఎత్తలేదు. వచ్చిన ఆదాయంలో వారికి మాత్రం నయాపైసా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సర్కారే పరోక్షంగా అవి పట్టా భూములని ఒప్పుకుంది. ఇప్పుడు మాత్రం పట్టాదారులకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం ఇస్తామని నోటిఫికేషన్ ఇచ్చింది.

కోతకు గురైన భూముల్లో..

మహదేవపూర్ మండలంలోని గోదావరి తీరంలోని వ్యవసాయ భూములు వందల ఎకరాల్లో మునకకు గురై ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పచ్చని పంటలతో కళకళలాడిన తమ భూముల్లో ఎడారిని తలపించేలా ఇసుక మేటలు వేశాయి. దీంతో వారంతా ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గాలు చూసుకున్నారు. అయితే అదే భూముల్లో దశాబ్దకాలంగా ఇసుకను సర్కారు అమ్ముకుని సొమ్ము చేసుకుంది. కానీ ఏనాడూ రైతుల గురించి పట్టించుకున్నది లేదు. తమ భూముల్లోని ఇసుకతో సర్కార్ వ్యాపారం చేస్తున్న కనీసం నోరు తెరిచి అడగలేదు.

ఇప్పుడు పరిహారంతోనే సరి..

కాళేశ్వరం ప్రాజెక్టుకులో మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో మునకకు గురవుతున్న భూములకు పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో గోదావరి నీటితో కోతకు గురైన పంట భూములు కూడా ఉన్నాయి. అదే భూముల్లోని ఇసుకను ప్రభుత్వం అమ్మి సొమ్ము చేసుకుంది. ఇందులో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు మాత్రం ఆదాయంలో వాటాలు పంచింది. కానీ పట్టాదారులకు మాత్రం నయపైసా విదిల్చలేదు. ఇంతకాలం వేల కోట్ల రూపాయల ఆదాయం గడించిన సర్కారు రైతాంగాన్ని ఆదుకునేందుకు ఏనాడూ సాహసించలేదు. ఇప్పుడు మాత్రం కాళేశ్వరంలో మునకకు గురవుతున్న భూములుగా గుర్తించి నామమాత్రంగా పరిహారం అందిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed