సురక్షిత ప్రాంతాలకు తరలించండి : కలెక్టర్

by Shyam |   ( Updated:2020-08-16 09:08:13.0  )
సురక్షిత ప్రాంతాలకు తరలించండి : కలెక్టర్
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు అన్ని జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా పురాతన ఇళ్లు కూలిపోయే అవకాశం ఉందని, అలాంటి వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.

చెరువులు, వాగులు, వంకలు పొంగి కట్టలు తెంచుకునే అవకాశం ఉన్నందున వెంటనే గ్రామాల్లో తెలియజేసి, ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని సూచించారు. గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉండి ఎప్పటికప్పుడూ పరిస్థితులను గమనిస్తూ సర్పంచ్‌ల సహకారంతో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్లు జనాల్లో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని తెలిపారు.

మండల, డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు పరిస్థితులను తెలుపాలని సూచించారు. ఇరిగేషన్ పంచాయతీ రాజ్, హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకుని ఏదైనా ప్రమాదం, అత్యవసర పరిస్థితి ఏర్పడితే అప్రమత్తులై ప్రజలను ఆదుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్టయితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed