కేసీఆర్ గారూ.. కేరళను ఫాలో ‘కరోనా’!

by Shamantha N |
కేసీఆర్ గారూ.. కేరళను ఫాలో ‘కరోనా’!
X

దిశ, వెబ్‌డెస్క్: యావత్ ప్రపంచాన్ని ఎవ్రీ సెకన్ కంటికి మీద కునుకు లేకుండా చేస్తున్న మాయదారి కరోనా వైరస్‌ను మన పొరుగు స్టేట్ కేరళ తిప్పికొడుతోంది. పక్కా ప్రణాళికలతో రాకాసి కరోనాను కట్టడి చేసేందుకు కదం తొక్కుతోంది. వైరస్‌ నివారణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దూసుకెళ్తోంది. దేశంలోనే ఫస్ట్‌ టైం కరోనా వైరస్ కేసును టేకప్ చేసిన కేరళ, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో దేశంలో అందరికంటే పది అడుగులు ముందుకేసి.. ప్రజెంట్‌ సూపర్ వెదర్‌ను కల్పిస్తోంది. అంతేకాదు బడ్జెట్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా కరోనాపై పోరాటానికి రూ.20,000 కోట్లు కేటాయించి శభాష్ అనిపించుకుంటోంది.

పక్కా ప్రణాళికలు, పకడ్బందీ వ్యూహాల్లో భాగంగా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో అందరినీ ఇంటికే పరిమితం చేసి, ఎవ్వరూ బయటకు రాకుండా అన్నీ వారి వద్దకే తీసుకెళ్లి ఇస్తోంది. దీని కోసం ప్రత్యేక కమిటీలు, టీంలను ఏర్పాటు చేసి అన్నం, వాటర్, రేషన్‌ సరుకులతోపాటు కుటుంబానికి కావాల్సిన మొత్తం నిత్యావసర వస్తువులను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లోనే ఉండి రోజువారీ ఖర్చులకు ఇబ్బందిపడే వారిని దృష్టిలో పెట్టుకొని రూ.1,320 కోట్లు కేటాయించి ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి పెన్షన్ తీసుకోని కుటుంబానికి కరోనా పెన్షన్ రూపంలో రూ.1,000 ఆర్థిక సాయం అందిస్తోంది. అటు పాత పెన్షనర్ల రెండు నెలల డబ్బులను ఇప్పుడే అడ్వాన్స్‌గా ఇస్తోంది.

అంతేగాక రూ.100 కోట్లతో మీల్స్ సదుపాయం కల్పించి 20 రూపాయలకే అందిస్తోంది. రూ.50 కోట్లతో హెల్త్ ప్యాకేజీ, ఉద్యోగ భద్రత కోసం రూ.2 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం అన్నీ అమలు చేసుకుంటూపోతుంది. వీటన్నింటితోపాటు ఏప్రిల్‌లోపు ఉద్యోగుల ఏరియర్స్‌ రూ.14,000 కోట్లను విడుదల చేసింది. దీంతో మెజార్టీ ఉద్యోగులతోపాటు చాలా కుటుంబాలకు కొద్దిరోజులు ఆర్థిక కష్టాలు లేకుండా చేసింది. జైళ్లలో ఉన్న ఖైదీలతో ఫేస్ మాస్క్‌లు తయారు చేయించి వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ పంపిణీ చేస్తోంది. ప్యాసింజర్ ఆటోలు, వెహికిల్స్‌లో తక్కువ ఛార్జీలు వసూలు చేసేలా ఆదేశాలు జారీ చేసి, ఇంటర్నెట్ సౌకర్యం మెరుగ్గా ఉండేలా బ్రాడ్‌బాండ్ వ్యవస్థను పర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేసింది.

ఓ వైపు రూ.20 వేల కోట్ల నిధులతో చర్యలు చేపట్టి కరోనా వ్యాప్తి చెందకుండా కేరళ ఆదర్శంగా నిలుస్తుంటే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.500 కోట్లు కేటాయించి ఎవర్నీ ఇంటి నుంచి వెళ్లొద్దని కండీషన్స్ పెడుతోంది. అక్కడ పినరయి విజయన్ సర్కార్ కండీషన్స్ పెట్టి వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో అన్నీ ఉచితంగా పంపిణీ చేస్తుంటే ఇక్కడ మాత్రం అటువంటి చర్యలేవీ చేపట్టకుండా బయటకు వెళ్లొద్దని కేవలం ఆదేశాలు ఇచ్చింది. కానీ, ప్రభుత్వ ఆదేశాలను పాటించి ఇంట్లోనే కూర్చుంటే నిత్యావసర వస్తువుల నుంచి ఇతర ఆర్థిక కష్టాలు ఎవరు తీరుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు రోజూ పని చేస్తేనే పూట గడవడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కేరళ రాష్ట్రం తీసుకున్న చర్యల్లో కనీసం 10 పర్సెంట్ కూడా చేపట్టకుండా స్వీయ నిర్బంధంలోనే ఉండాలనడం గమనార్హం. అటు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరోజు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చినా నేపథ్యంలో ఎంతమేరకు వైరస్ కట్టడి అవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Tags: Corona Virus, Cm Pinarayi Vijayan, Rs. 20 thousand crores of funds, masks, food, Corona pensions, food, Telangana, Rs 500 crores

Advertisement

Next Story

Most Viewed