ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్​మెంట్​కు క్లియరెన్స్​

by Shyam |   ( Updated:2021-04-11 06:17:49.0  )
ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్​మెంట్​కు క్లియరెన్స్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. శనివారం దీనిపై నిర్ణయం తీసుకుని రాత్రిపూట ఉత్తర్వులు జారీ చేసింది. 30 శాతం ఫిట్​మెంట్​ ఇచ్చేందుకు ఫైనాన్స్​ నుంచి క్లియరెన్స్​ వచ్చింది. దీంతో వచ్చేనెల పెరిగిన వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జమ కానున్నాయి. కానీ కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల వేతనాల పెంపుపై సందిగ్థత కొనసాగుతోంది. అన్ని రకాల ఉద్యోగులకు పీఆర్సీ అమలవుతుందని సీఎం కేసీఆర్​ ప్రకటించినప్పటికీ… ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల అంశంలో మాత్రం అనుమానాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక శాఖ మార్గదర్శకాలు కూడా సిద్ధం చేయలేదు. తాజాగా శనివారం జారీ చేసిన 30 శాతం ఫిట్​మెంట్​ ఉత్తర్వుల్లో కేవలం ప్రభుత్వ రెగ్యులర్​ ఉద్యోగులకే పరిమితం చేశారు.

మినిమమ్​ రూ. 19 వేలు ఎలా?

ఉద్యోగులకు కనీస వేతనం రూ. 19 వేలుగా వేతన సవరణ కమిషన్​ నివేదికల్లో సూచించింది. దీంతో పీఆర్సీ సిఫారసు చేసిన వేతనాలను వర్తింపజేయాలా? ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపును అమలు చేయలా? అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్​ అసెంబ్లీ ప్రకటనలో మాత్రం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సహా అన్నిరకాల ఉద్యోగులకు వేతన పెంపును వర్తింపజేస్తామంటూ ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా చెప్పినా దీనిపై మళ్లీ ప్రస్తావన లేదు. శాఖల వారీగా మార్గదర్శకాలు ఉంటాయని అధికారులు భావించారు. కానీ ఆర్థిక శాఖ నుంచి అలాంటి ప్రపోజల్​ లేనేలేవు. దీంతో వీరికి పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తారా? లేదా? అనేది స్పష్టత కరువైంది. అతి తక్కువ జీతాలతో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మాత్రం తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపు కాకుండా, పీఆర్సీ సిఫారసు చేసిన కనీస వేతనాలను అమలు చేయాలంటున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూపు–4 కేటగిరీలో ఆఫీస్‌ సబార్డినేట్, వాచ్‌మెన్, మాలీ, కావుటి, కుక్, సైకిల్‌ ఆర్డర్లీ, చౌకీదార్, ల్యాబ్‌ అటెండర్, దఫేదార్, జమేదార్, జిరాక్స్‌ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ష్రాఫ్‌/క్యాషియర్, లిఫ్ట్‌ ఆపరేటర్లకు నెలకు రూ. 12 వేలు ఇస్తుండగా… వీరికి కనీస వేతనం రూ. 19 వేలు చేయాలని పీఆర్సీ కమిషన్‌ సిఫారసు చేసింది. రూ. 13 వేల నుంచి రూ.15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కూడా బేసిక్‌ పే రూ. 19 వేలు చేయాలని సిఫారసు చేసింది. గ్రూపు–3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్‌ ఆపరేటర్, స్టోర్‌ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్‌ అసిస్టెంట్, సినిమా/ఫిలిం/ఆడియోవిజువల్‌/డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్, లైబ్రేరియన్, మేనేజర్‌ కేటగిరీల్లో నెలకు రూ. 15 వేలు వేతనంగా ఉండగా కనీస వేతనం రూ.22,900 చేయాలని, ఇదే కేటగిరీలో రూ. 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కనీస వేతనం రూ. 22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. గ్రూపు–3(ఏ) కేటగిరీలోని సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ స్టెనో, సీనియర్‌ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌/డీపీవోలకు ప్రస్తుతం రూ. 17,500 ఇస్తుండగా వారికి రూ. 31,040 కనీసం వేతనం ఇవ్వాలని సూచించారు.

ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ ప్రస్తుతం నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40,270 పొందుతున్న ఉద్యోగులు ఉండగా… కనీస వేతనాన్ని రూ. 19 వేలుగా సూచించారు. జూనియర్‌ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 వుంది జూనియర్‌ లెక్చరర్లు ఉండగా రూ. 37,100 వేతనం వస్తోంది. పీఆర్సీ వీరికి రూ. 54,220 కనీస వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. 435 మంది పాలిటెక్నిక్‌ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు రూ. 40,270 వేతనంగా ఇస్తున్నారు. వీరికి రూ. 58,850 కనీస వేతనంగా చేయాలని సిఫారసు చేసింది.

ఆరోగ్య శాఖలో అధ్వాన్నమే

ఆరోగ్య శాఖ పరిధిలో ఉద్యోగుల్లో ఒకే పని చేస్తున్న వారికి మూడు రకాలుగా వేతనాలిస్తున్నారు. గాంధీ, టిమ్స్​, నిమ్స్​ లాంటి ఆసుపత్రులను ప్రత్యేకంగా కరోనా రోగుల కోసమే కేటాయించారు. పర్మినెంట్​ డాక్టర్లను మినహాయిస్తే… అక్కడ పనిచేసే మిగతా సిబ్బంది వేతనాల మధ్య చాలా తేడాలున్నాయి. నర్సింగ్​ స్టాఫ్​, టెక్నీషియన్లు, ల్యాబ్​ ఆపరేటర్లు, వార్డు బాయ్స్​లలో కొందరు పర్మినెంట్​లో, మరికొంత మంది కాంట్రాక్టు జీవో నెంబర్​ 14 ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది, వారితో పాటు మరో రకం కాంట్రాక్ట్​ వర్కర్లూ ఉన్నారు. జీవో నెంబర్​ 14 ద్వారా నియమించిన కాంట్రాక్ట్​ ఔట్​ సోర్సింగ్​ సిబ్బందిలో కొంతమందికి పర్మనెంట్​ ఉద్యోగులతో పాటు జీతాలు పెంచే అవకాశం పరిశీనలో ఉంది. ప్రస్తుతం రెగ్యులర్​ నర్సింగ్​ సిబ్బందికి రూ.50 వేలకుపైనే వేతనాలుండగా కాంట్రాక్ట్​ ఔట్​ సోర్సింగ్​ నర్సులకు మాత్రం రూ.25 వేలలోపే ఉంది. పర్మనెంట్​ ల్యాబ్​ టెక్నీషియన్స్​కు రూ.40 వేల దాకా జీతాలుంటే.. కాంట్రాక్ట్​ వారికి మాత్రం రూ.15,500, వార్డు బాయ్​లకు రెగ్యులర్​ వాళ్లకు రూ.25 వేలు ఉంటే, కాంట్రాక్ట్​ సిబ్బందికి రూ.12 వేలే ఇస్తున్నారు. థర్డ్​ పార్టీ కాంట్రాక్ట్​ వర్కర్లు ఇంకా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆపరేషన్​ థియేటర్లు, బాత్రూంలు, ఓపెన్​ ఏరియా, హాల్స్​లో ఏరియాను లెక్కించి పరిశుభ్రతకు వర్కును కేటాయిస్తున్నారు. శానిటేషన్​ సిబ్బందికి రూ.10 వేలు, పేషెంట్​ కేర్​ సిబ్బందికి రూ.9,400, సెక్యూరిటీ సిబ్బందికి రూ. 9,800 మేర చాలీచాలని జీతాలు ఇస్తున్నారు.

మార్గదర్శకాలు వస్తేనే పెంపు

ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగులకే ఫిట్​మెంట్​ ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయగా… కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల వేతనాల పెంపుపై మార్గదర్శకాలు వస్తేనే పెంపు ప్రక్రియ మొదలవుతుంది అధికారులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలేమీ లేవు. ఉదాహరణగా మండల స్థాయిలో ఐకేపీ ఏపీఎంలు… ఎంపీడీఓలతో సమానస్థాయిలో పని చేస్తుంటే ఏపీఎంలకు ఇచ్చే వేతనం రూ. 25 వేల వరకే. కానీ ఎంపీడీఓలు లక్షకు చేరువలో ఉంటున్నారు. ఇప్పుడు వారికి బేసిక్​పేపై చెల్లిస్తే… ఏపీఎం వంటి ఉద్యోగులకు తక్కువే వస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎప్పుడు మార్గదర్శకాలు వస్తాయా… అనేది ఎదురుచూడాల్సే వస్తోంది.

Advertisement

Next Story

Most Viewed