గులాబీ పార్టీలో గుప్పుమన్న విభేదాలు.. చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లు..

by Shyam |   ( Updated:2021-08-22 06:15:04.0  )
గులాబీ పార్టీలో గుప్పుమన్న విభేదాలు.. చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లు..
X

దిశ‌, అందోల్ః అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్ పార్టీలో విబేధాలు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి. అంత‌ర్గత పోరు కాస్తా బ‌హిర్గత‌మైంది. గ‌తంలో కొద్ది మంది కౌన్సిల‌ర్లు మాత్రమే మున్సిపల్ చైర్మన్‌ నాయ‌క‌త్వంపై ఆసంతృప్తిగా ఉండ‌గా, శ‌నివారం మున్సిప‌ల్ సర్వసభ్య స‌మావేశంలో జ‌రిగిన పరిణామాలతో వ్యతిరేకుల సంఖ్య పెరిగింది. చైర్మన్ మ‌ల్లయ్య ఏకప‌క్ష నిర్ణయాల‌తో వైస్ చైర్మన్ ప్రవీణ్‌తో పాటు 11 మంది టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల‌ర్‌లు స‌మావేశాన్ని వాకౌట్ చేస్తున్నట్లు బ‌హిరంగంగానే ప్రక‌టించి, స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంపై అధికార పార్టీలో క‌ల‌వ‌రాన్ని రేపాయి. మున్సిప‌ల్‌లోని అధికార పార్టీ కౌన్సిల‌ర్‌లే స్వంత పార్టీ చైర్మన్ తీరును వ్యతిరేకించ‌డం పట్ల ప‌ట్టణంలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. వీరి వ్యవ‌హ‌రం ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్‌కు త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పవ‌చ్చు.


ఈ నెల 10న మున్సిప‌ల్ చైర్మన్ మ‌ల్లయ్య త‌న వ్యవ‌సాయ క్షేత్రం వ‌ద్ద పాల‌క‌మండ‌లి స‌భ్యుల‌తో క‌లిసి నిర్వహించిన స‌మావేశంలో 25 అంశాల‌ను స‌ర్వసభ్య స‌మావేశంలోని ఎజెండా అంశాల‌లో పొందుప‌ర్చాల‌ని నిర్ణయించారు. అయితే ఈ నెల 21న (శ‌నివారం) మున్సిప‌ల్ కార్యాల‌యంలో నిర్వహించిన సర్వస‌భ్య స‌మావేశంలో49 అంశాల‌తో కూడిన ఎజెండా కాపీ రావ‌డంపై వారు ఆసంతృప్తిని వ్యక్తం చేసి, స‌మావేశం ప్రారంభంకాక‌ముందే అధికార పార్టీ స‌భ్యులు వాకౌట్ చేసి, బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. హ‌రిత‌హ‌రం కింద రూ.21 ల‌క్షలు ఖ‌ర్చు చేసి మొక్కలు పెట్టిన‌ట్లు, విద్యుత్ మ‌ర‌మ్మత్తుల నిమిత్తం 1 నుంచి 5 వార్డుల‌కు గాను రూ.5 ల‌క్షలు, పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో మున్సిప‌ల్ సిబ్బంది, యంత్రాలతో చేప‌ట్టిన ప‌నుల‌కు సైతం రూ.2.50 ల‌క్షలు, ఇలా ఛాయ్ బిస్కెట్‌ల నుంచి ఎమ్మెల్యే, జాయింట్ క‌లెక్టర్ స్థాయి అధికారులు ఎప్పుడైన వ‌స్తే అందుకు అయ్యే ఖ‌ర్చుల‌ను సైతం అడ్డగోలుగా ఎజెండాల‌లో చేర్చార‌ని, ప్రజా స‌మ‌స్యల గురించి కాకుండా కేవ‌లం బిల్లులు చెల్లింపులే ప్రధాన ఎజెండాగా న‌మోదు చేశార‌ని, అందుకే తాము స‌మావేశాన్ని బ‌హిష్కరించాల్సి వ‌చ్చింద‌న్నారు.

ప్రస్తుతం సీజ‌న‌ల్ వ్యాధులు పెరుగుతున్నాయ‌ని, వాటి నివార‌ణ‌లో భాగంగా దోమ‌ల మందు వార్డులో పిచికారి చేయించాల్సి ఉంద‌ని, పిచ్చి మొక్కలు పెర‌గ‌కుండా ఎప్పటిక‌ప్పడు చూడ‌డం, ప్రజ‌లు జాగ్రత్తలు తీసుకునేలా వారిని అప్రమ‌త్తం చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీపైన ఉంద‌న్న విష‌యాన్ని చైర్మన్ విస్మరించార‌న్నారు. ఇదిలాఉండ‌గా కాంగ్రెస్ పార్టీ కౌన్సిల‌ర్లు సైతం మ‌హిళ కూర‌గాయాల వ్యాపారుల‌పై అక్రమంగా కేసులు పెట్టించినందుకు నిర‌స‌న‌గా వారు కూడా బ‌హిష్కరిస్తున్నట్లు ప్రక‌టించి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక చైర్మన్‌, క‌మిష‌న‌ర్ లు స‌మావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యేకు త‌ల‌నొప్పిగా వ్యవ‌హ‌రం

అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల వ్యవ‌హ‌రం రోజు రోజుకు ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్‌కు త‌ల‌నొప్పిగా మారింది. మున్సిపాలిటీలో 20 వార్డులుండ‌గా 13 స్థానాల‌ను టీఆర్ఎస్‌, 6 మంది కాంగ్రెస్‌, ఒక‌రు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. చైర్మన్‌గా మ‌ల్లయ్య నియామ‌కం జ‌రిగిన కొన్ని మాసాల‌కే అధికార పార్టీ కౌన్సిల‌ర్లకు మ‌ధ్య దూరం పెరుగుతూ వ‌చ్చింది. వీళ్ల దూరాన్ని ద‌గ్గర చేసే నాయ‌కత్వం లేక‌పోవ‌డం, చైర్మన్ ఒంటెద్దు పొక‌డ‌ల‌తో ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్‌కు త‌ల‌నొప్పిగా మారింది. గ‌తంలో జ‌రిగిన స‌ర్వస‌భ్య స‌మావేశానికి న‌లుగురు అధికార పార్టీ స‌భ్యులు హ‌జ‌రు కాక‌పోవ‌డంపై, కోరం లేక‌పోవ‌డంతో స‌మావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పిన అధికారులు, గుట్టు చ‌ప్పుడు కాకుండా ఎజెండాలోని తీర్మాణాల‌ను ఆమోదింప‌జేశారు. అయితే ఈ సారి స‌ర్వసభ్య స‌మావేశానికి ఏకంగా 12 మంది స‌భ్యులు చైర్మన్ తీరును త‌ప్పుప‌డుతూ స‌మావేశాన్ని బ‌హిష్కరించారు. ఈ విష‌యం నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశంగా మారింది.

కౌన్సిల‌ర్లపై వేటు?

ఈ నెల 21న జోగిపేట మున్సిప‌ల్ స‌ర్వస‌భ్య స‌మావేశాన్ని బ‌హిష్కరించిన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల‌ర్లపై వేటు ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. వీరి వ్యవ‌హ‌రంపై ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉంటూ స‌ర్వస‌భ్య స‌మావేశాన్ని ఏలా బ‌హిష్కరిస్తార‌ని, ఏదైనా స‌మ‌స్య ఉంటే అంత‌ర్గతంగా మాట్లుడుకోవాలి, లేదంటే త‌న దృష్టికి తీసుకురావాలి. వాళ్లు తీసుకున్న నిర్ణయంతో పార్టీ ప‌రువు తీసేసిన‌ట్లయింద‌ని ప‌ట్టణ పార్టీ నాయ‌కుల‌తో అన్నట్లుగా స‌మాచారం. పార్టీ క్రమ శిక్షణ చ‌ర్యల్లో భాగంగా ముందుగా షోకాజ్ నోటీసుల‌ను జారీ చేయాల‌ని, త‌ర్వాత ఒక‌రిద్దర్ని పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తే, మిగ‌తా వారంతా సేట్ అవుతార‌న్న యోచ‌న‌లో ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది.

చైర్మన్‌ను మార్చండి: కౌన్సిల‌ర్లు

మున్సిప‌ల్ చైర్మన్ మ‌ల్లయ్య ఏక‌ప‌క్ష నిర్ణయాల‌తో తాము 20 మాసాల‌ నుంచి విసిగిపోయామ‌ని అధికార పార్టీ కౌన్సిల‌ర్లు ఆవేద‌న‌ను వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నామ‌న్న గొప్పే త‌ప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న విధంగా మా ప‌రిస్థితి ఉందన్నారు. వార్డులలో ఏలాంటి అభివృద్ది ప‌నుల‌ను చేప‌ట్టలేక‌పోతున్నామన్నారు. కౌన్సిల‌ర్లుగా గెలిచినా త‌మ‌కు ద‌క్కాల్సిన గౌరవం ద‌క్కడం లేద‌ని, చైర్మన్ ఏక‌ప‌క్ష నిర్ణయాలు మాకు త‌ల‌నొప్పిగా మార‌య‌న్నారు. కౌన్సిల‌ర్లుగా గౌర‌వించని వ్యక్తిని తాము చైర్మన్‌గా ఏలా అంగీక‌రించాలన్నారు. చైర్మన్ అవ‌లంభిస్తున్న తీరును ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్ కు వివ‌రించి, పట్టణ అభివృద్ధి పట్టింపులేని చైర్మన్ ని రాజీనామా చేయించాల‌ని, ఆయ‌న స్థానంలో మ‌రెవ‌రినైనా నియ‌మించాల‌ని కోరుతామ‌న్నారు. మాకు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇస్తార‌ని, తామేవ్వరం కూడా ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని, అవ‌సర‌మైతే రాజీనామా చేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని తెల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed