రాష్ట్రమంతటా చప్పట్లు

by Shyam |   ( Updated:2023-08-08 08:40:26.0  )
రాష్ట్రమంతటా చప్పట్లు
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు రాష్ట్రమంతటా ప్రజలు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధకంలో వైద్యులు పోషిస్తున్న పాత్రను ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలియజేశారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారులు, సీఎంఓ సిబ్బంది చప్పట్లు కొట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సహా అధికారులు, కుటుంబ సభ్యులు ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టి ప్రధాని పిలుపుకు మద్దతు పలికారు. నగర పోలీసు కమిషనర్ సైతం టాంక్‌బండ్ సమీపంలోని లేపాక్షి చౌరస్తా దగ్గర చప్పట్లు కొట్టారు. పోలీసులు సైతం ఐక్యతను చాటిచెప్పారు. ఇక నగరంలోని అనేక అప్పార్టుమెంట్లలో సైతం ప్రజలు బాల్కనీల్లో నిలబడి, రోడ్డు మీదకు వచ్చి ప్రధాని పిలుపుకు సంఘీభావంగా చప్పట్లు కొట్టారు. కొద్దిమంది శంఖం ఊదారు. మరికొద్దిమంది ఇంట్లో అన్నం తినే ప్లేట్లపై చెంచాలతో శబ్దం చేసి మద్దతు పలికారు.

ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు సరిగ్గా ఐదు గంటలు సైరన్ మోగించాయి. ఆ సమయానికి రోడ్లమీద ఉన్నవారు ఐదు నిమిషాల పాటు ఆగి మద్దతు పలికారు. ఇక పరిశ్రమల సమీపంలోని నివాస ప్రాంతాల్లోని ప్రజలు ఇండ్లల్లోంచి బైటకు వచ్చి వారికి తోచిన తీరులో శబ్దాలు చేశారు. పిల్లలు సైతం తల్లిదండ్రుల ఆదేశాలకు లోబడి ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. జనతా కర్ఫ్యూ కారణంగా అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఐదు గంటలకు చప్పట్లు, శబ్దాలతో మారుమోగిపోయింది. ప్రధాని పిలుపుకు స్పందించినవారు ఈ తరహా మద్దతు పలికితే ఆ విషయం తెలియనవారు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాకా ఆశ్చర్యపోయారు.

ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా శబ్దాలతో మార్మోగిపోవడంతో పెంపుడు జంతువులు ఒక్కసారిగా బెదిరిపోయాయి. చప్పట్ల అనంతరం చాలా చోట్ల భారత్ మాతా కీ జై, కరోనాని ఓడిస్తాం.. అంటూ నినాదాలు చేశారు. మరికొద్దిమంది చేతుల్లో త్రివర్ణ పతాకాలను చేతబూని ఐక్యతను చాటిచెప్పారు.

Advertisement

Next Story