సంతృప్తితో వెళ్తున్నా: సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే

by Shamantha N |
సంతృప్తితో వెళ్తున్నా: సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే
X

న్యూఢిల్లీ: మధుర జ్ఞాపకాలు, సంతోషం, శక్తివంచన లేకుండా సేవలందించిన సంతృప్తితో సుప్రీంకోర్టును వీడుతున్నానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే శుక్రవారం పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో చివరి రోజు తనలో మిశ్రమ అనుభూతులను పురికొల్పిందని, అవి చెప్పడానికి సాధ్యపడటం లేదని అన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో తనకు అమూల్యమైన అనుభవాలను, అనుభూతులను సంపాదించుకున్నారని, తోటి సహోదర న్యాయమూర్తులూ ఇందులో భాగంగా ఉన్నారని వివరించారు.

న్యాయమూర్తిగా 21ఏళ్లు సేవలందించిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే 2019 నవంబర్‌లో సుప్రీంకోర్టు 47వ సీజేగా బాధ్యతలు తీసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ బాబ్డే వీడియో కాన్ఫరెన్సింగ్‌లో విచారణకు ఆదేశించారు. ఈ విచారణనూ ఆయన గుర్తుచేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ విచారణలో అరుదైన దృశ్యాలు కనిపించేవని, కొన్నిసార్లు న్యాయవాదుల వెనుక పెయింటింగ్‌లు, గన్నులు, పిస్టల్స్ కూడా చూసేవాడినని వివరించారు. లాక్‌డౌన్‌తో కోర్టుల నిర్వహణపై అనుమానాలు ఏర్పడ్డ తరుణంలో జస్టిస్ బాబ్డే ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారని, వర్చువల్ హియరింగ్‌ల ద్వారా 50వేల కేసుల పరిష్కారానికి ఆయన నిర్ణయం దోహదపడిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ ఎన్‌వీ రమణ శనివారం నుంచి బాధ్యతలు తీసుకోనున్నారు.

Advertisement

Next Story