నోరెత్తొద్దు.. రేవంత్‌రెడ్డికి సిటీ సివిల్ కోర్టు ఆదేశం

by Shyam |
Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్, ఈడీ విచారణల్లో మంత్రి కేటీఆర్‌ను ముడిపెట్టే తీరులో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 20వ తేదీన జరగనున్నందున అప్పటివరకు ఇంజెంక్షన్ ఉత్తర్వులను జారీ చేసింది. మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావాను విచారించిన సిటీ అదనపు చీఫ్ జడ్జి కోర్టు మంగళవారం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిగానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు సంబంధింగానీ కేటీఆర్‌కు సంబంధం ఉందంటూ రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది.

మాదకద్రవ్యాల కేసులో కేటీఆర్‌కు సంబంధం ఉందంటూ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆధార రహితమని, మంత్రి పరువు ప్రతిష్ఠకు భంగం కలిగించాయని పేర్కొంటూ సిటీ చీఫ్ జడ్జి కోర్టులో పరువునష్టం దావాను న్యాయవాది నవీన్ కుమార్ దాఖలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు, ఆధార రహితమైన విమర్శలు చేసినందుకు తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని, బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా రేవంత్‌రెడ్డిని ఆదేశించాలి ఆ పిటిషన్‌లో కోర్టును కేటీఆర్ కోరారు. ప్రతిష్ఠను భంగపరిచేలా చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని, ఇకపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటీ చీఫ్ జడ్జి కోర్టు వచ్చే నెల 20వ తేదీ వరకు డ్రగ్స్, ఈడీ విచారణ కేసులో కేటీఆర్‌ను ముడిపెట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisement

Next Story