‘ఎఫ్‌డీఐ’పై చైనా ఏమన్నదో తెలుసా!

by Shyam |
‘ఎఫ్‌డీఐ’పై చైనా ఏమన్నదో తెలుసా!
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇటీవల కీలకమైన ఎఫ్‌డీఐ పాలసీని సవరించింది. ఈ నిర్ణయంతో భారత సరిహద్దులను పంచుకునే దేశాల కంపెనీలు మన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి అయింది. ఇండియా విదేశీ పెట్టుబడుల విధానాన్ని సవరించడంతో చైనాకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. పెట్టుబడులకు ఆటంకాలేర్పడేలా విధానాలను మార్చడం సబబు కాదని చెప్తోంది. ఇండియా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పాలసీ సవరణ గురించి చైనా స్పందిస్తూ.. ఈ నిర్ణయం వివక్షాపూరితంగా ఉందని, అంతేకాకుండా డబ్ల్యూటీవో మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.

ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారి కారణంగా భారతీయ కంపెనీల అవకాశవాద స్వాధీనాలను అరికట్టడానికి, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) తన విదేశీ పెట్టుబడి విధానాన్ని సవరించింది. ఇండియాతో సరిహద్దులను పంచుకునే చైనా సహా దేశంలో పెట్టుబడులు పెట్టే దేశాల సంస్థలకు ఇది చాలా క్లిష్టమైన వ్యవహారం.

సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ కౌన్సిలర్ జి రోంగ్ మాట్లాడుతూ, నిర్దిష్ట దేశాల నుండి పెట్టుబడిదారుల కోసం భారతదేశం నిర్దేశించిన తాజా అడ్డంకులు డబ్ల్యూటీవో నియమాలను ఉల్లంఘిస్తాయి. సరళీకరణ, సులభతర ధోరణికి వ్యతిరేకంగా ఉందన్నారు.

అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకాల విభాగం విదేశీ పెట్టుబడుల విధానాన్ని మార్చగానే సరిహద్దులను కలిగి ఉన్న కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. మన దేశానికి సరిహద్దుగా ఉన్న పెద్ద దేశం చైనా. ఆ దేశ సంస్థలు మన దేశ సంస్థల్లో ఎక్కువ వాటాలను కలిగి ఉంటాయి. 2019 డిసెంబర్ నాటికి ఇండియాలో చైనా పెట్టుబడుల విలువ రూ.800 కోట్లు దాటాయి. ఈ మొత్తం ఇండియాతో సరిహద్దు కలిగిన మిగిలిన దేశాల పెట్టుబడుల కంటే అధికం. ఈ కారణంగానే ఎఫ్‌డీఐ పాలసీ మార్పు చైనా పెట్టుబడిదారులపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో ఎలక్ట్రిక్ పరికరాలు, మొబైల్ ఫోన్‌లు, మౌలిక వసతులు, ఆటో మొబైల్ వంటి రంగాల్లో చైనాకు చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. దీనికి చైనా సానుకూలమైన కారణాన్ని కూడా చెబుతోంది. ఇండియాలో తమ పెట్టుబడుల కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని, ఇది రెండు దేశాలకు కలిసి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం కరోనాతో పోరాటానికి తమ సంస్థలు కూడా విరాళాలు ఇచ్చాయని చెప్తోంది.

విదేశీ సంస్థలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది ఇండియాలోని ఆర్థిక అవసరాలు, వ్యాపార స్థితిగతులు, ప్రాధాన్యాలను బట్టి ఉంటుందని, కొవిడ్-19 ప్రపంచ దేశా ఆర్థిక వ్యవస్థలను కబళిస్తున్న ఈ సమయంలో రెండు దేశాలు సహకరించుకోవాలని, పెట్టుబడులకు అవకాశాలను కల్పిస్తూ.. వ్యాపార, వాణిజ్యం కొనసాగేలా చూడాలసిన అవసరముందని చైనా వాపోయింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం… ఏ దేశం నుంచి పెట్టుబడులు వచ్చినా వివక్ష ఉండకూడదు. తగిన అవకాశాలను సృష్టించాలని చైనా చెప్పుకొచ్చింది. ఇదివరకే జీ20 దేశాధినేతలు, వాణిజ్య మంత్రులు పారదర్శకత, వివక్షాపూరిత వాణిజ్యం, స్వేచ్ఛాయుతమైన స్థితులను కల్పిస్తున్నాయని, మార్కెట్ సిద్ధాంతాల్ని బట్టి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో సంస్థలే నిర్ణయిస్తాయని తెలిపింది. ఇండియా ఇలాంటి ఇబ్బందికర విధానాల్లో మార్పులు చేస్తుందని భావిస్తున్నట్టు చైనా ఓ ప్రకటనలో వెల్లడించింది. అన్ని దేశాల పెట్టుబడులను ఇండియా సమదృష్టితో చూస్తుందని అభిప్రాయడుతున్నామై, సానుకూల వాణిజ్య వాతావరణం కల్పిస్తుందనే ఆశిస్తున్నట్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed