అమెరికాను విమర్శిస్తూ 'వైరస్ వీడియో' విడుదల చేసిన చైనా

by vinod kumar |
అమెరికాను విమర్శిస్తూ వైరస్ వీడియో విడుదల చేసిన చైనా
X

వాషింగ్టన్: చైనాలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో భారీగా ప్రాణ నష్టం కలగడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ అదుపుతప్పింది. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడం మొదలైన దగ్గర నుంచి చైనా లక్ష్యంగా అమెరికా విమర్శలు చేస్తూనే ఉంది. ఆ దేశం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయని అమెరికా మండిపడుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీ రోజు చైనాపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో అగ్నికి ఆజ్యం పోసేలా చైనా ఒక యానిమేటెడ్ వీడియోను విడుదల చేసింది. అమెరికాను విమర్శిస్తూ ‘వన్స్ అపాన్ ఏ వైరస్’ పేరుతో రూపొందించిన 39 సెకెండ్ల వీడియోను ఫ్రాన్స్‌లోని చైనా రాయబార కార్యాలయం విడుదల చేసింది. ”డిసెంబర్‌లో అపరిచిత న్యుమోనియా బయటపడినట్లు చైనా డబ్ల్యూహెచ్‌వోకు చెప్పింది. జనవరిలో కొత్త వైరస్ పుట్టిందని.. అది చాలా ప్రమాదకారి అని అమెరికాకు చెబితే లైట్ తీసుకుందని. అది సాధారణ ఫ్లూ అని కొట్టి పారేసి.. మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇంట్లోనే ఉండటం అంటే మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది. ఆ వైరస్ చికిత్స కోసం తాత్కాలిక ఆసుపత్రులు నిర్మిస్తే షో చేస్తున్నారంటూ ఎద్దేవా చేసింది. ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసరికి చైనా అబద్దాలు చెబుతోందని నిందిస్తోంది” అంటూ ఆ వీడియోలో యానిమేషన్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లతో పాటు అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా ప్రాణాంతకం అని వాళ్లకు తెలిస్తే ముందుగానే ఎందుకు హెచ్చరించలేదు. అసత్యాలను ప్రచారం చేస్తూ అమెరికా పరువు తీయడానికి చైనా రాయబారి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ వీడియో వ్యవహారం ఏ మలుపు తీసుకోనుందో..!

Tags : USA, Coronavirus, China, Animated Video, Once upon a Virus, Covid 19

Advertisement

Next Story

Most Viewed