బాబూ.. తెనాలి సభ సక్సెస్సా? ఫ్లాపా?

by srinivas |   ( Updated:2020-02-05 03:07:28.0  )
బాబూ.. తెనాలి సభ సక్సెస్సా? ఫ్లాపా?
X

ఆంధ్రప్రదేశ్‌లో లెజిస్లేటివ్ రాజధాని అమరావతిలో రైతుల ఆందోళనల ఉధృతిని తెనాలి సభ ద్వారా రాష్ట్రానికి చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు సంకల్పించారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంత రైతులతో కలిసి తెనాలిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అనుకున్నట్టే సభను కూడా నిర్వహించారు. అయితే ఈ బహిరంగసభ టీడీపీ లక్ష్యాలను సాధించిందా?

ఈ నేపథ్యంలోనే తెనాలి సభ తమ ఆందోళనలు, నిరసనల స్థాయిని తెలిపడంతో పాటు అమరావతిపై ప్రజల్లో సానుకూలత పెంచేందుకు దోహదపడుతుందని టీడీపీ భావించింది. ఈ సభలో సుమారు 20 వేల వరకు రాజధాని రైతులు పాల్గొంటారని పార్టీ నేతలు అధినేతకు తెలిపారు. దీంతో అమరావతి చుట్టుపక్కల ప్రజలంతా ఈ సభలో పాల్గొంటారని మంగళగిరి పరిసరాల నుంచి టీడీపీ మద్దతు దారులతో పాటు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు భారీ స్థాయిలో తరలి వస్తారని బాబు అంచనావేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులను కూడా సిద్ధం చేశారు. కేవలం గుంటూరు, విజయవాడల్లో మాత్రమే నిరసనలకు పరిమితం కాని టీడీపీ నేతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసి అమరావతికి నైతిక మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

దీంతో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. సభను 3 గంటలకు నిర్వహిస్తారని టీడీపీ శ్రేణులు చెబుతూ వచ్చాయి. టీడీపీ ఊహించినంత స్థాయిలో సభకు సభికులు హాజరుకాలేదు. దీంతో సభను 8 గంటలకు ప్రారంభించారు. ఆలస్యం కావడంతో ఉత్సాహంగా సభలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు కూడా నెమ్మదిగా జారుకోవడం ప్రారంభించారు. పార్టీ పెద్దల ప్రసంగాల అనంతరం చంద్రబాబు ఉద్రేక పూరితంగా ప్రసంగం చేస్తున్న సమయంలో సభికులు సభాప్రాంగణాన్ని వీడడం కనిపించింది.

సభలో వేదిక దగ్గరగా ఉన్న సీట్లు కాకుండా మిగిలిన కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఉన్న మద్దతుదారులు కూడా నెమ్మదిగా సభ నుంచి నిష్కృమిస్తుండడంతో సభాసదుల కంటే ముందే సభికులు ఆ ప్రాంగణం నుంచి జారిపోవడం సభ విఫలమైందనేందుకు తార్కాణంగా నిలిచింది. దీంతో తెనాలి సభా వేదికపై నుంచే అమరావతికి సానుకూలత కూడగట్టాలన్న టీడీపీ ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.

రాజధాని ప్రాంత రైతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వంచిస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ తెనాలి సభతో అవాక్కైంది. అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్న రీతిలో తెనాలి సభ ఫ్లాప్ కావడంతో టీడీపీ అంతర్మధనంలో పడింది. తాజా సభ రైతులే అమరావతిలో భూముల యజమానులైతే సభ విజయవంతమయ్యేది కదా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో మూడు రాజధాని నిర్ణయంపై వైఎస్సార్సీపీ స్టాండ్ కరెక్టేనా? అని టీడీపీ కార్యకర్తలు అంతర్మధనంలో మునిగినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed