జాగ్రత్త పడకపోతే.. ఏం చేసినా ఫలితం ఉండదు: చంద్రబాబు

by srinivas |
జాగ్రత్త పడకపోతే.. ఏం చేసినా ఫలితం ఉండదు: చంద్రబాబు
X

రాజకీయ వర్గాల్లో దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి పేరు. సీనియర్ రాజకీయ వేత్తైన చంద్రబాబు కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో కరోనాకు ఒక స్థాయిని దాటిన తరువాత వైద్యం అందించలేమని అభిప్రాయపడ్డారు. చైనాలోని వుహాన్ నగరంలో కరోనా కారణంగా 62 రోజుల పాటు లాక్ డౌన్ విధించారని, భారత్ లో 49 రోజుల లాక్ డౌన్ అవసరమని నిపుణులు చెబుతున్నారని ఆయన హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి, నివారణకు ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొక్కై వంగనిదే మానై వంగునా సామెతను గుర్తు చేస్తూ, కరోనాను ఈ స్థాయిలో రూపుమాపితే ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ ఉండే దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్న ఆయన అలాంటి దేశాల్లో కూడా కరోనా ఉందన్న విషయాన్ని విస్మరించరాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉందని అన్నారు. వరుసగా కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతుండడమే దానికి నిదర్శనమని అన్నారు.

హృదయ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్లు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వారికి ఇది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ వైరస్ సామాన్యులనే కాకుండా వైద్యులను కూడా కబళిస్తుండడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. వైద్యులు, ఇతర సిబ్బందికి తగిన రక్షణ సామగ్రి అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటి కొరత ఉందని ఆయన తెలిపారు. రేషన్ షాపులు తెరవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారని ఆయన ప్రభుత్వాన్ని నిందించారు. భౌతికదూరం పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు గుమికూడేలా చేయడం మంచిది కాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.

వలంటీర్ల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందన్న కారణంతో పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతిన్నదని, రొయ్యలన్నీ చెరువుల్లోనే ఉన్నాయని, కొనే నాథుడే లేడని అన్నారు. ప్రభుత్వమే రొయ్యల రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హార్టీకల్చర్ రంగం కూడా కుదేలైందని, పంటలన్నీ పొలాల్లోనే ఉండిపోయాయని, కూలీలు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. తాను రాజకీయాలు చేయాలని కోరుకోవడం లేదని, ప్రభుత్వానికి హెచ్చరికలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు.

వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వలసదారులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలని కోరుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ కారణంగా కొందరు ఇళ్లలో అదేపనిగా ఆలోచిస్తున్నారని, కరోనా వస్తే చనిపోతారని భయపడుతున్నారని వివరించారు. అయితే కరోనా సోకినవాళ్లందరూ చనిపోరని, వయసు పైబడినవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లకే ఈ వైరస్ ప్రమాదకరమని, అనవసరంగా ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

Tags : corona virus, chandrababu naidu, covid-19, tdp, andhrapradesh, cbn,

Advertisement

Next Story

Most Viewed