ఉల్లి నిల్వలపై కేంద్రం ఆంక్షలు..

by Shamantha N |
ఉల్లి నిల్వలపై కేంద్రం ఆంక్షలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యుడు నానా అవస్థలు పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కేంద్రం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. హోల్ సేలర్లు, రిటైలర్ల స్టాక్ నిల్వలపై పరిమితి విధిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ శుక్రవారం ప్రకటించారు. ఈ ఆంక్షలు తక్షణం అమల్లోకి వస్తాయన్నారు. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. తాజా పరిమితి ప్రకారం హోల్‌సేలర్ల స్టాక్ పరిమితి 25 మెట్రిక్ టన్నులు కాగా, రిటైలర్ల వద్ద 2 మెట్రిక్ టన్నులకు మించి సరకు నిల్వ ఉండరాదని అందులో పేర్కొన్నారు.

భారత్‌లో ఉల్లి వినియోగం ఎక్కువని, ఇందువల్ల నిరంతరాయంగా ఉల్లి సేద్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని లీలా నందన చెప్పారు. అయితే, సెప్టెంబర్ రెండో వారం నుంచి ధరలు క్రమంగా పెరుగుతున్నట్లు గమనించామన్నారు. ధరల పెరుగుదల ఆధారంగానే ఆంక్షలు ఉంటాయని, ధరల స్థిరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 35,000 మెట్రిక్ టన్నుల ఉల్లి సరఫరా చేసిందన్నారు. ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా సరఫరా ఉంటుందని వివరించారు.కేంద్రం లక్ష టన్నుల బఫర్ స్టాక్ ఉంచిందన్నారు. ధరల స్థిరీకరణ కోసం బహిరంగ మార్కెట్ అమ్మకాల ద్వారా కూడా ఉల్లిగడ్డ అందుబాటులో ఉంచుతామన్నారు. కాగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలో వర్షాలు కురుస్తుండటంతో ఉల్లి ధరలు పెరిగినట్లు ఆహారం, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed