మాజీ ఐపీఎస్ ఆఫీసర్‌పై కేసు..

by Shamantha N |
మాజీ ఐపీఎస్ ఆఫీసర్‌పై కేసు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

మాజీ ఐపీఎస్ అధికారి కుప్పుసామి అన్నామలైపై కేసు నమోదైంది. అంటు వ్యాధుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలో ఆయనపై కేసు నమోదు చేసినట్లు కోయంబత్తూరు నగర పోలీసులు తెలిపారు. అదేవిధంగా కుప్పుసామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ నంద కుమార్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీకే సెల్వ కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎస్ఆర్ శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనగ సభాపతిలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కుప్పుసామి అన్నామలై గత సెప్టెంబరులో ఐపీఎస్ సర్వీస్‌కు రాజీనామా చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు, పార్టీ తమిళనాడు చీఫ్ ఎల్ మురుగన్ సమక్షంలో మంగళవారం న్యూఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. గురువారం ఆయన కోయంబత్తూరులోని వీకేకే మీనన్ రోడ్డులోని బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చారు. బీజేపీ నేతలు ఆయన్ను సన్మానించి, భగవాన్ మురుగకు సంబంధించిన దివ్యమైన వేలాయుధాన్ని బహూకరించారు. అనంతరం అన్నామలై మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారాని కుప్పుసామి తదితరులపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story