నేవీలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక.. నెలకు లక్ష రూపాయల జీతం

by D.Reddy |
నేవీలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక.. నెలకు లక్ష రూపాయల జీతం
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ నేవీలో పని చేయాలనుకునే అభ్యర్థులకు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్‌లలో 270 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అన్నీ లెవెల్‌-10 హోదా ఉద్యోగాలే. ఇంటర్, బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన పెళ్లికాని మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వేతనం మొదటి నెల నుంచే రూ.లక్ష ఉంటుంది. ప్రొబేషన్‌ వ్యవధి పోస్టును బట్టి రెండు లేదా మూడేళ్లు ఉంటుంది.

ఎంపిక విధానం:

అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (SSB) ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇందులో విజయవంతమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, తుది నియామకానికి ఖరారు చేస్తారు. ఎంపికైన వారికి నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో జనవరి, 2026 నుంచి 22 వారాలపాటు సంబంధిత విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మరో 22 వారాలు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో తదుపరి శిక్షణ ఉంటుంది. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు:

ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: జనరల్‌ సర్వీస్‌లో 60 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ 18, నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ 22, పైలట్‌ 26 ఖాళీలకు బీఈ/బీటెక్‌లో 60, పది, ఇంటర్‌లోనూ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. లాజిస్టిక్స్‌ 28 ఖాళీలకు ఎందులోనైనా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ లేదా ఎంబీఏ లేదా ఎమ్మెస్సీ(ఐటీ)/ఎంసీఏ లేదా బీఎస్సీ/బీకాంతోపాటు లాజిస్టిక్స్‌/సప్లై చెయిన్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.

ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌: ఇందులో అన్ని విభాగాల్లోనూ కలిపి 15 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆ పోస్టుల ప్రకారం బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివినవారు అర్హులు.

టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ 38, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ 45, నేవల్‌ కన్‌స్ట్రక్టర్‌ 18 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: పోస్టు ప్రకారం మారుతుంది. ఎక్కువ ఖాళీలకు జనవరి 2, 2001/2002 - జనవరి 1, 2005/2006/2007 మధ్య జన్మించినవారు అర్హులు.

ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. NCC (C) సర్టిఫికెట్‌ ఉంటే అకడమిక్‌ మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తులో పోస్టులవారీ ప్రాధాన్యం తెలపడం తప్పనిసరి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 25.

ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతా.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/



Next Story