Donald Trump: 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన ట్రంప్ ప్రభుత్వం

by S Gopi |
Donald Trump: 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన ట్రంప్ ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను చేపట్టిన వెంటనే తనదైన శైలిలో నిర్ణయాలను అమలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన బై-ఔట్‌ను ప్రకటించారు. యూఎస్ ఫెడరల్ ఉద్యోగులు ఫిబ్రవరి 6లోగా తమ ఉద్యోగాలను వదిలివేయాలని, స్వచ్ఛందంగా దీన్ని ఎంచుకున్న వారికి ఎనిమిది నెలల జీతం ఇవ్వనున్నట్టు పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయం నుంచి వచ్చిన మెమో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికా ప్రభుత్వాన్ని పునర్నిర్మించే ప్రణాళికలో భాగంగా తీసుకున్నదని మెమో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తనను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన మెయిల్‌ను 20 లక్షల మంది ఉద్యోగులకు పంపారు. ప్రభుత్వ ఆఫర్‌ను కనీసం 10-15 శాతం మంది ఉద్యోగులు ఎంచుకున్న సరే, ప్రభుత్వంపై ఏడాదికి 100 బిలియన్ డాలర్ల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. కొవిడ్-19 మహమ్మారి తర్వాత చాలామంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. వారందరూ కూడా వారానికి ఐదురోజులు ఆఫీసులకు రావాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, అంతకుముందు జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను సైతం డొనాల్డ్ ట్రంప్ నిలిపేస్తున్నారు. తాజాగా అనవసర ఖర్చులను అరికట్టే ప్రయత్నంలో భాగంగా గాజాలో కండోమ్స్ పంపిణీ కోసం బైడెన్ ప్రభుత్వం కేటాయించిన 50 మిలియన్ డాలర్లను ట్రంప్ ప్రభుత్వం నిలిపేసింది.

Next Story

Most Viewed