వరుస నష్టాల నుంచి బయటపడ్డ సూచీలు

by S Gopi |
వరుస నష్టాల నుంచి బయటపడ్డ సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో సూచీలు పుంజుకున్నాయి. ప్రధానంగా ఐటీ, ఆటో, మెటల్ రంగాల షేర్లలో ర్యాలీ కనిపించింది. వీటితో పాటు వరుస నష్టాల తర్వాత కనిష్టాల వద్ద కొనుగోళ్లు మద్దతిచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 496.37 పాయింట్లు లాభపడి 71,683 వద్ద, నిఫ్టీ 160.15 పాయింట్ల లాభంతో 21,622 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్‌టీ, ఐటీసీ షేర్లు లాభాలు సాధించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.06 వద్ద ఉంది. మార్కెట్ల ర్యాలీతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ శుక్రవారం ఒక్కరోజే రూ.4.05 లక్షల కోట్లు పెరిగి రూ.373.54 లక్షల కోట్లకు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed