అత్యధిక పీడబ్ల్యూడీలను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న ఐదు కంపెనీలు!

by Mahesh |   ( Updated:2022-12-04 12:41:56.0  )
అత్యధిక పీడబ్ల్యూడీలను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న ఐదు కంపెనీలు!
X

న్యూఢిల్లీ: భారత్‌లోని టాప్-50 లిస్టెడ్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12,295 మంది వికలాంగులకు(పీడబ్ల్యూడీ) శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించాయని ఓ నివేదిక తెలిపింది. డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ నివేదిక ప్రకారం, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో కంపెనీలు అత్యధిక సంఖ్యలో పీడబ్ల్యూడీలను నియమించుకున్నాయి. మొత్తం నిఫ్టీ-50 కంపెనీలు నియమించిన ఉద్యోగుల్లో ఈ ఐదు కంపెనీల వాటాయే 75 శాతమని నివేదిక తెలిపింది. మొత్తం పీడబ్ల్యూడీల నియామకాలు అంతకుముందు 2020-21 ఆర్థిక సంవత్సరం కంటే 10.6 శాతం ఎక్కువ కావడం విశేషం.

అయినప్పటికీ మొత్తం సాధారణ ఉద్యోగుల కంటే వికలాంగుల శాశ్వత నియామకాలు సగం కంటే తక్కువే ఉన్నాయి. ఎస్‌బీఐలో మొత్తం ఉద్యోగులు 2,44,250 కాగా, 5,096 మంది మాత్రమే వికలాంగ ఉద్యోగులున్నారు. అలాగే, రిలయన్స్‌లో 3.42 లక్షల మంది సాధారణ ఉద్యోగులుండగ, 1,410 మంది పీడబ్ల్యూడీలున్నారు. మిగిలిన కంపెనీల్లో సైతం ఇదే తరహాలో వ్యత్యాసం ఉంది. గత కొన్నేళ్లుగా టెక్, రిటైల్, ఆతిథ్య రంగాల్లో పీడబ్ల్యూడీల నియామకాలు గణనీయంగా పెరుగుతున్న ధోరణి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలే వీరిని ఎక్కువగా తీసుకుంటున్నాయని డిజిటల్ యాక్సెసబిలిటీ టెస్టింగ్, కన్సల్టెన్సీ సంస్థ బారియర్‌బ్రీక్ సొల్యూషన్స్ సీఈఓ శిల్పి కపూర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed