Interest rates: 2024లో వడ్డీ రేట్ల తగ్గింపు లేనట్లే: SBI chairman

by Harish |   ( Updated:2024-09-18 11:18:28.0  )
Interest rates: 2024లో వడ్డీ రేట్ల తగ్గింపు లేనట్లే: SBI chairman
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపు గురించి ప్రకటన రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్న తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) చైర్మన్ చల్లా శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఏడాదిలో ఆర్‌బీఐ, వడ్డీ రేట్లను తగ్గించే చేసే అవకాశం లేదని అన్నారు. జనవరి- మార్చి 2025 నాటికి తగ్గింపు గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో ద్రవ్య విధాన కమిటీ (MPC) అక్టోబర్ 7-9 తేదీల్లో సమావేశమై వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకోనుంది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు నేపథ్యంలో ఈ సమావేశంలో దేశీయంగా కోతలు ఉంటాయని అనుకుంటుండగా, SBI చైర్మన్ వ్యాఖ్యలతో ఆర్‌బీఐ నిర్ణయంపై మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 3.54 శాతం నుండి ఆగస్టులో 3.65 శాతానికి స్వల్పంగా పెరిగింది. అయితే ఇది ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతం లోపు ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 2023 నుండి బెంచ్ మార్క్ రెపో రేటును యథాతథంగా ఉంచింది. గత సమావేశంలో, ఆరుగురు MPC సభ్యులలో నలుగురు రేపో రేటును అలాగే ఉంచడానికి అనుకూలంగా ఓటు వేయగా, ఇద్దరు రేటు తగ్గింపుకు ఆమోదం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed