RBI: తొమ్మిదోసారి రెపో రేటులో మార్పు లేదు

by S Gopi |
RBI: తొమ్మిదోసారి రెపో రేటులో మార్పు లేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గురువారం ముగిసిన ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో వరుసగా తొమ్మిదోసారి కీలక రెపో రేటును 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తూ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆరుగురు సభ్యుల్లో 4-2 మెజారిటీతో స్థిర వైఖరిని కొనసాగిస్తూ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. రెపో రేటును ప్రస్తుత స్థాయిల వద్దే కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన దాస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం జూన్‌లో ఆహార పదార్థాల ధరలు ప్రభావంతో మళ్లీ పెరిగింది. అయితే, దేశీయంగా సేవల రంగం సమర్థవంతంగా కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. బ్యాంకులతో పాటు కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యంగానే ఉన్నాయి. ఇటీవల సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ మూలధన వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పెట్టుబడులకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని దాస్ వివరించారు. మరోవైపు, ప్రపంచ ఆర్థికవ్యవస్థకు సెంట్రల్ బ్యాంకుల కఠిన విధాన నిర్ణయాలు, అప్పుల పెరుగుదల, భౌగోళిక రాజకీయ పరిణామాలు సవాలుగా మారుతున్నాయని దాస్ పేర్కొన్నారు.

ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను 7.2 శాతం స్థిరంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. గత ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ వృద్ధి అంచనాను 7 శాతం నుంచి 7.2 శాతానికి సవరించింది. అలాగే, ద్రవ్యోల్బణానికి సంబంధించి నైరుతి రుతుపవనాల ప్రభావంతో దిగిరావొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

ఈ ఏడాది ఆగష్టు 2వ తేదీ నాటికి భారత విదేశీ మారక నిల్వలు 675 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయిల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెట్టుబడులకు అవకాశాలు పెరగడంతో బ్యాంకు డిపాజిట్లలో తగ్గుదల కనిపిస్తోందని దాస్ తెలిపారు. దానివల్ల బ్యాంకులు క్రెడిట్ డిమాండ్ సాధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీని అధిగమించేందుకు ఫ్యామిలీ సేవింగ్స్‌ను ఆకర్షించే అంశాన్ని బ్యాంకులు పరిశీలించాలని దాస్ సూచించారు. ఇదే సమయంలో పలు ఫైనాన్స్ కంపెనీలు టాప్-అప్ లోన్‌లు, గోల్డ్ లోన్‌ల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. వాటిని నియంత్రించే చర్యలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు చేపట్టాలని దాస్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story