FMCG: పెరగనున్న సబ్బులు, టీ పొడి సహా నిత్యావసర వస్తువులు

by S Gopi |
FMCG: పెరగనున్న సబ్బులు, టీ పొడి సహా నిత్యావసర వస్తువులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రోజువారీ కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు మరింత భారం కానున్నాయి. గత కొంతకాలంగా దేశంలో డిమాండ్ నెమ్మదించినప్పటికీ, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను ఎదుర్కోవడానికి, మార్జిన్‌లను కాపాడుకునేందుకు కంపెనీలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా సబ్బులు, టీ సహా ఎలక్ట్రానిక్స్ వంటి రోజూవారీ నియావసర వస్తువులను ధరలను పెంచనున్నాయి. గతేడాది ద్వితీయార్థం నుంచి భారత కరెన్సీ రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటం వల్ల ముడి పదార్థాల ధరలు భారంగా మారాయి. ఇప్పటికే కంపెనీలు ఈ భారం ఎక్కువైన ఓసారి ధరల పెంపును అమలు చేశాయి. మరోసారి పెంపు నిర్ణయం అమలైతే మూడు నెలల్లో రెండోసారి ప్రజలపై భారం పడనుంది. మరోవైపు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఏడు నెలల తర్వాత ఇన్‌పుట్ ఖర్చుల నుంచి బయటపడేందుకు ధరలను పెంచనున్నాయి. గతంలో డిమాండ్ తగ్గిన సమయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు అమ్మకాలు పెరిగేందుకు ధరలను తగ్గించేవి. మార్జిన్‌ల కంటే అమ్మకాలను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి. అయితే, ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా సబ్బులపై పెంపు తప్పనిసరి నిర్ణయంగా మారిందని భావిస్తున్నట్టు గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట ఎండీ సుధీర్ సీతాపతి అభిప్రాయపడ్డారు. డిసెంబర్ త్రైమాసికంలో దేశీయంగా 22.5 శాతం మార్జిన్ నమోదైందని, అయితే ఇది సగటు 24-26 శాతం కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగించేదిగా ఉందని ఆయన వివరించారు. కాగా, గత త్రైమాసికంలోనే కంపెనీలు ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు వంటనూనె, సబ్బులు, స్కిన్ క్రీమ్ వంటి వాటి ధరలను 5-20 శాతం మధ్య పెంచాయి. ముడిపదార్థాల ఖర్చులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. దీనివల్ల గతేడాది పామాయిల్ 40 శాతం, టీ 24 శాతం, వంటనూనె 15-40 శాతం, గోధుమ పిండి 16 శాతం పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed