IT Department: ఇప్పటివరకు రూ. 17 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు

by S Gopi |
IT Department: ఇప్పటివరకు రూ. 17 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఇప్పటివరకు 16 శాతం పెరిగాయని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. సోమవారం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 12 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.9 శాతం పెరిగి రూ. 16.9 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో వ్యక్తిగత పన్ను 21.6 శాతం వృద్ధితో రూ. 8.7 లక్షల కోట్లకు చేరాయని, ఇదే సమయంలో కార్పొరేట్ పన్ను 8.1 శాతం క్షీణించి రూ. 7.7 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఐటీ విభాగం పేర్కొంది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ) 75.2 శాతం పెరిగి రూ. 44,538 కోట్లుగా ఉన్నాయి. స్థూలంగా కూడా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.9 శాతం అధికంగా రూ. 20.6 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సమీక్షించిన కాలంలో రీఫండ్లు 42.5 శాతం పెరిగి రూ. 3.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక విధానాలు, ఆర్థికవ్యవస్థ స్థిరమైన వృద్ధి కారణంగానే పన్ను వసూళ్లు సానుకూలంగా ఉన్నాయని పన్ను నిపుణులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 38.4 లక్షల కోట్ల స్థూల పన్ను రాబడిని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందులో ప్రత్యక్ష పన్ను వసూళ్లే రూ. 22.07 లక్షల కోట్లను లక్ష్యంగా ఉంది. పరోక్ష పన్నుల ద్వారా రూ. 16.33 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది.

Next Story

Most Viewed