IT JOB: ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 14 గంటల పనికి ప్రతిపాదనలు

by Harish |
IT JOB: ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 14 గంటల పనికి ప్రతిపాదనలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కర్ణాటకలో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలు రాగా, దీనిపై వ్యతిరేకత రావడంతో ప్రస్తుతం పక్కన పెట్టారు. తాజాగా కర్ణాటకలోని ఐటీ సంస్థలు ఉద్యోగుల పని వేళలను 12 గంటల నుంచి 14 గంటలకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఐటీ కంపెనీలు తమ ప్రతిపాదనను కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1961 రివిజన్‌లో పొందుపరచాలని కోరుతున్నట్లు నివేదిక పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాన్ని సవరించే యోచనలో ఉందని తెలుస్తుంది.

దీంతో ఐటీ రంగంలో పనిచేస్తున్న టెక్కీలు ఆందోళన చెందతున్నారు. పనిగంటలు పెంచడం ద్వారా తమ ఆరోగ్యం క్షీణించడంతో పాటు లేఆఫ్స్ కు దారితీస్తుందని ఐటీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం, ఉన్న కార్మిక చట్టాల ప్రకారం, 12 గంటల పని సమయం ఉంది. దీనిలో10 గంటలు అసలు కాగా, 2 గంటల ఓవర్‌టైమ్ ఉంది. అయితే కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, 14 గంటల పని వేళలో 12 గంటల పనిసమయంతో పాటు 2 గంటల ఓవర్‌టైమ్ ఉండనుంది.

కొత్త ప్రతిపాదన ద్వారా IT/ITeS/BPO సెక్టార్‌లోని ఉద్యోగులు రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. అదే నెలల్లో 125 గంటలకు మించకూడదు. కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ సవరణ వల్ల కంపెనీలు ప్రస్తుత మూడు-షిఫ్ట్‌ల సిస్టమ్ నుంచి రెండు-షిఫ్ట్ సిస్టమ్‌కు మారే అవకాశం ఉందని, దీని ఫలితంగా మూడింట ఒక వంతు మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Next Story