అన్ని రిఫైనరీలలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ల ఏర్పాటు: ఐఓసీ!

by Vinod kumar |
అన్ని రిఫైనరీలలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ల ఏర్పాటు: ఐఓసీ!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) 2046 నాటికి నికర సున్నా నిర్వహణ ఉద్గారాలకు చేర్చాలని లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అదే సమయానికి సంస్థకు చెందిన అన్ని రిఫైనరీలలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తామని ఐఓసీ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య అన్నారు. ఇది రూ. 2 లక్షల కోట్ల విలువైన గ్రీన్ ట్రాన్సిషన్ ప్రణాళికలో భాగంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ రాబోయే కొన్నేళ్ల పాటు ప్రధాన ఇంధనంగా కొనసాగనుంది. అయితే, మేము గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనం, ఈవీ, ప్రత్యామ్నాయ ఇంధనాలతో కూడిన మార్పులకు సిద్ధమవుతున్నామని శ్రీకాంత్ మాధవ్ చెప్పారు.

మొదట 2025 నాటికి రూ. 2 వేల కోట్లతో పానిపట్ ఆయిల్ రిఫైనరీలో ఏడాదికి 7 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ తర్వాతి దశల్లో అన్ని రిఫైనరీల్లో గ్రీన్ హైడ్రోజన్ యూనిట్లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. మొత్తంగా నికర సున్నా ఉద్గారాల లక్ష్యం కోసం రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం. ఈ మొత్తంతో రిఫైనరీల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌లు, సామర్థ్యం పెంపు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండటం, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం కోసం వెచ్చిస్తామని శ్రీకాంత్ మాధవ్ వెల్లడించారు. ఇంధన వ్యాపారంలో అస్థిరతను అధిగమించేందుకు పెట్రోకెమికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఐఓసీ వ్యాపారాన్ని పునర్నిర్మిస్తోంది. అందులో భాగంగానే పెట్రోల్ పంపులను ఎనర్జీ ఔట్‌లెట్‌లుగా మారుస్తోంది. ఇవి సాంప్రదాయ ఇంధనాలతో పాటు ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, బ్యాటరీ మార్పిడి సేవలను అందించనుంది.

Advertisement

Next Story

Most Viewed