వరుసగా మూడో నెల కూడా తగ్గిన రష్యా చమురు దిగుమతులు..

by Shiva |
వరుసగా మూడో నెల కూడా తగ్గిన రష్యా చమురు దిగుమతులు..
X

న్యూఢిల్లీ : చౌకైన రష్యా చమురు దిగుమతులు వరుసగా మూడో నెల క్షీణించాయి. ఆగష్టు నెలకు సంబంధించి రష్యా నుంచి భారత చమురు దిగుమతులు ఏడు నెలల కనిష్ఠానికి తగ్గి 14.6 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి. అంతకు ముందు జూలైలో 19.1 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి జరిగింది. దేశీయంగా వర్షాకాలం కావడంతో డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గతేడాది రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా రష్యా తక్కువ ధరకు చమురును విక్రయించడం ప్రారంభించింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం రష్యా నుంచి చౌక చమురును కొనుగోలు చేసింది.

2022, ఫిబ్రవరి ముందు వరకు భారత్ చమురు దిగుమతుల్లో 1 శాతం వాటా ఉన్న రష్యా, ఆ తర్వాత గణనీయంగా పెరిగింది. దాదాపు సగం దిగుమతులు రష్యా నుంచే వచ్చే స్థాయికి చేరింది. ఇటీవల దేశీయ డిమాండ్ తగ్గడం, చమురు సంస్థల మెయింటెనెన్స్ కారణంగా దిగుమతులు తగ్గాయి. మరోవైపు రష్యాతో పాటు ఇరాక్ నుంచి కూడా భారత చమురు కంపెనీలు దిగుమతులను తగ్గించాయి. జూలైలో 8.91 లక్షల బ్యారెళ్ల నుంచి ఆగష్టులో 8.66 లక్షల బ్యారెళ్లకు క్షీణించాయి. ఇదే సమయంలో సౌదీ అరేబియా నుంచి చమురు దిగుమతి 4.84 లక్షల బ్యారెళ్ల నుంచి 8.20 లక్షల బ్యారెళ్లకు పెరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed