AI: ఏఐ స్వీకరణలో గ్లోబల్ లీడర్‌గా భారత్: డెలాయిట్ నివేదిక

by S Gopi |
AI: ఏఐ స్వీకరణలో గ్లోబల్ లీడర్‌గా భారత్: డెలాయిట్ నివేదిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. 80 శాతానికి పైగా వ్యాపారాలు స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ ఏజెంట్ల అభివృద్ధిని వినియోగించేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నాయి. మానవ ప్రమేయం లేకుండా నిర్దిష్ట లక్ష్యాలను సాధించేందుకు, టాస్క్‌లు, ప్రాసెస్‌లను ఆటోమెట్ చేసేందుకు చాలా పరిశ్రమలు ఏఐ వాడకాన్ని పెంచుతున్నాయి. ఈ టెక్నాలజీపై పెరుగుతున్న ఆసక్తి దేశీయంగా ఏఐ ఆవిష్కరణ, సామర్థ్యం కోసం కంపెనీలు అనుసరిస్తున్న ధోరణిలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. దేశీయ డెవలపర్లు ఏఐ మోడల్స్, చిప్స్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఏఐ ద్వారా తక్కువ ఖర్చుతో టెక్నాలజీ అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని కంపెనీలు కూడా ఆశిస్తున్నాయి. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, ఏజెంట్ ఏఐ వినియోగంపై కంపెనీలు ఎక్కువ దూకుడును ప్రదర్శిస్తున్నాయని స్టేట్ ఆఫ్ జెన్ఏఐ నివేదిక విడుదల సందర్భంగా డెలాయిట్ పేర్కొంది. 14 దేశాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నివేదికను రూపొందించినట్టు డెలాయిట్ తెలిపింది. ఇందులో ఏజెంట్ ఏఐ అనేది ఏఐ సిస్టమ్స్ ద్వారా స్వయంగా పరిష్కారాలను అందిస్తుంది. 70 శాతం సంస్థలు ఆటోమేషన్ కోసం జెన్ఏఐని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. సగానికి పైగా కంపెనీలు 10 కంటే ఎక్కువ జెన్ఏఐ ప్రయోగాలను నిర్వహిస్తున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో ఏఐని ఉపయోగించడంలో సవాళ్లు ఉన్నాయని 36 శాతం కంపెనీలు, డేటా క్వాలిటీపై ఆందోళనలు ఉన్నాయని 30 శాతం కంపెనీలు చెబుతున్నాయి. ఏఐని మరింత వేగంగా వినియోగించదంపై భారతీయ సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, మరో రెండేళ్లలో వీటిని అధిగమించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం పెట్టుబడులు, అవసరమైన ప్రణాళిక, వేగంగా పెరుగుతున్న ఈ టెక్నాలజీ ద్వారా తమ రంగంలో పోటీ ఇచ్చేందుకు కీలకమని కంపెనీలు భావిస్తున్నాయి.

Next Story

Most Viewed