ITR Filing: ఐటీఆర్ దాఖలుకు ముగుస్తున్న గడువు.. పొడిగింపుపై నో క్లారిటీ

by S Gopi |
ITR Filing: ఐటీఆర్ దాఖలుకు ముగుస్తున్న గడువు.. పొడిగింపుపై నో క్లారిటీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీఆర్) దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ గడువు ముగియనుంది. రిటర్నుల ఫైలింగ్‌కు కొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకటించింది. వివిధ రకాల నివేదికలు, ఊహాగానాలకు విరుద్ధంగా ఈ సంవత్సరం గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. జరిమానాలు లేదా ఆఖరు నిమిషంలో సమస్యలను ఎదుర్కొనకుండా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను సకాలంలో దాఖలు చేయాలని పేర్కొంది. గడువు దాటిన తర్వాత కూడా జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేసే వీలున్నప్పటికీ పాత పన్నుల విధానంలో చేసే వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. గడువు ముగిసిన తర్వాత కొత్త పన్నుల విధానంలో మాత్రమే ఐటీఆర్ దాఖలు చేయడానికి వీలుంటుంది. దానివల్ల అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. జూలై 26 నాటికి ఐదు కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, గతేడాదితో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగిందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. మరోవైపు ఐటీఆర్ దాఖలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై కొందరు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ఐటీఆర్ ఫైలింగ్ కోసం గడువు పొడిగించాలని కోరుతున్నారు. కానీ, ఐటీ శాఖ మాత్రం గడువు పొడిగింపునకు అవకాశం లేదని చెబుతోంది.

Advertisement

Next Story

Most Viewed