చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

by S Gopi |
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
X

దిశ, బిజినెస్ బ్యూరో: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి మార్పు చేయట్లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో గడిచిన ఏడు త్రైమాసికాల్లో ప్రభుత్వం మొదటిసారిగా పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో పెంపు నిర్ణయం తీసుకోలేదు. అంతకుముందు చివరిసారిగా 2022, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం నుంచి వరుసగా తొమ్మిది త్రైమాసికాల పాటు మంత్రిత్వ శాఖ వడ్డీ రేట్లను సవరిస్తూ వచ్చింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, '2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఏప్రిల్ 1, 2024 నుంచి జూన్ 30, 2024 వరకు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా.. సేవింగ్స్ డిపాజిట్‌లపై వడ్డీ రేటు 4 శాతం ఉండగా, ఏడాది టైమ్ డిపాజిట్లపై 6.9 శాతం, 2 ఏళ్ల టైమ్ డిపాజిట్(7 శాతం), 3 ఏళ్ల టైమ్ డిపాజిట్(7.1 శాతం), ఐదేళ్ల టైమ్ డిపాజిట్(7.5 శాతం), ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్(6.7 శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(8.2 శాతం), మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్(7.4 శాతం), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(7.7 శాతం), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(7.1 శాతం), కిసాన్ వికాస్ పత్ర(7.5 శాతం-115 నెలలు), సుకన్య సమృద్ధి యోజన(8.2 శాతం) వడ్డీ రేట్లు కొనసాగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed