ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు!

by Mahesh Kanagandla |
ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు!
X

దిశ, నేషనల్ బ్యూరో: జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమై కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై, సీనియర్ సిటిజెన్లు హెల్త్ కవర్ కోసం చెల్లించే ప్రీమియంలపై పన్ను ఎత్తివేయాలనే ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. రూ. 5 లక్షల వరకుహెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ కట్టే సీనియర్ సిటిజన్లే కాకుండా ఇతరులకూ పన్ను మినహాయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఓ అధికారి తెలిపారు. రూ. 5 లక్షలకు మించిన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ కట్టేవారికి ఎప్పటిలాగే 18 శాతం జీఎస్టీ చెల్లిస్తారు. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, టర్మ్ పాలసీలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.

నిత్యావసరాలపై వస్తు, సేవల పన్ను తగ్గించి, విలాస వస్తువులపై పెంచే ప్రతిపాదనలు చేశారు. 20 లీటర్లు, అంతకుమించిన తాగునీటి బాటిల్స్‌, రూ. 10 వేలలోపు విలువైన సైకిళ్లు, ఎక్సర్‌సైజ్ నోట్ బుక్‌ సహా పలు అత్యావసరమైన వస్తువులను ఐదు శాతం శ్లాబులోకి తేవాలనే నిర్ణయానికి వచ్చినట్టు అధికారులు చెప్పారు. అలాగే, రూ. 25 వేలకు మించి పలికే హై ఎండ్ రిస్ట్ వాచ్‌లు, రూ. 15 వేల కంటే ఎక్కువ ఖరీదు చేసే షూస్ వంటివాటిని 18 శాతం శ్లాబు నుంచి 28 శాతం శ్లాబులోకి మార్చాలని ప్రతిపాదించినట్టు వివరించారు. హెయిర్ డ్రైయర్, హెయిర్ కర్లర్, బ్యూటీ లేదా మేకప్ ప్రిపరేషన్స్ పరికరాలను 18 శాతం శ్లాబులో నుంచి 28 శాతం శ్లాబులోకి మార్చనున్నట్టు చెప్పారు. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణపై బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలో పలువురు మంత్రులతో జీఎస్టీ కౌన్సిల్ ఓ కమిటీ వేసింది. ‘ప్రజలకు ఉపశమనం కల్పించాలనేదే మా తపన. ముఖ్యంగా వయో వృద్ధులపై మా ప్రత్యేక దృష్టి ఉన్నది. జీఎస్టీ కౌన్సిల్‌కు మేం మా నివేదికను అందిస్తాం. తుది నిర్ణయం జీఎస్టీ మండలీదే’ అని చౌదరి వివరించారు.

రూ. 22 వేల కోట్ల సర్‌ప్లస్?

ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం పన్నులతో నాలుగు శ్లాబులు ఉన్నాయి. అత్యవసరమైన వస్తువులను పన్ను నుంచి మినహాయించడం లేదా కనిష్ట శ్లాబులో చేర్చగా.. విలాస వస్తువులను 28 శాతం శ్లాబులోకి తీసుకున్నారు. కానీ, జీఎస్టీ వసూళ్లు అనూహ్యంగా పడిపోయాయి. రెవెన్యూ తటస్థ రేట్ 15.3 శాతం కూడా రాలేవు. దీంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసి జీఎస్టీ రేట్లు క్రమబద్ధీకరించాలని కోరింది. జీఎస్టీ వసూళ్లు ఆరోగ్యకరంగా ఉంటూనే పేద ప్రజలపై పన్ను భారం వీలైనంత వరకు లేకుండా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపింది. మంత్రివర్గ ఉపసంఘం తమ ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా సమర్పించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుని అమలు చేస్తే రూ. 22 వేల కోట్ల సర్‌ప్లస్ రాబటి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నష్టాల్లో నుంచి రాబడిలోకి రావడంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్‌లపై ఇస్తున్న మినహాయింపులనూ అధిగమించేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఉంటాయని వివరిస్తున్నారు.

Advertisement

Next Story