Gold: రికార్డు ధరలున్నా.. డిమాండ్ తగ్గని బంగారం

by S Gopi |
Gold: రికార్డు ధరలున్నా.. డిమాండ్ తగ్గని బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరినప్పటికీ డిమాండ్ ఏ మాత్రం తగ్గట్లేదు. కేంద్రం దిగుమతి సుంకం తగ్గించిన కారణంగా పసిడి గిరాకీ పుంజుకుంది. దీనికితోడు దేశవ్యాప్తంగా వివాహ, పండుగ వేడుకల కారణంగా గతేడాది బంగారం డిమాండ్ 5 శాతం అధికంగా 802.5 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తెలిపింది. బుధవారం సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2023లో 761 టన్నుల వరకు డిమాండ్ నమోదవగా, గతేడాది ఇది 802 టన్నులకు పెరిగింది. మొత్తం బంగారం డిమాండ్ విలువ 2023లో రూ. 3,92,000 కోట్లతో పోలిస్తే 2024లో 31 శాతం పెరిగి రూ.5,15,390 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఏడాదిలో కూడా బంగారం ఇదే స్థాయిలో కొనసాగనుంది. 700-800 టన్నుల వరకు గిరాకీ నమోదు కానుందని నివేదిక వివరించింది. ప్రస్తుతం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ధరల పెరుగుదల స్థిరంగా ఉంటే అమ్మకాలు పెరుగుతాయని, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోళ్లు మెరుగ్గా ఉంటాయని డబ్ల్యూజీసీ సీఈఓ సచిన్ జైన్ చెప్పారు. గతేడాది బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించింది. అయితే, అంతర్జాతీయ పరిణామాలు, ఇతర కారణాలతో బంగారం ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, బంగారం ధరలు వరుసగా ఐదవ సెషన్‌లోనూ పెరిగాయి. ఆభరణాలు, చిల్లర వ్యాపారుల నుంచి అత్యధిక డిమాండ్ వల్ల బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ. 1,040 పెరిగి గరిష్ట స్థాయి రూ.86,400కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి రూ. 950 పెరిగి రూ. 79,050కి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1న 10 గ్రాముల పసిడి రూ. 79,390గా ఉంది. నెల రోజుల్లో రూ. 6,410 నుంచి 86,400కి పెరిగింది. డిమాండ్‌తో పాటు బంగారంలో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని సచిన్ జైన్ చెప్పారు. 2024లో ఈ పెట్టుబడులు 29 శాతం అధికంగా 239.4 కోట్లకు చేరాయని తెలిపారు. 2023 నాటితో పోలిస్తే ఇది 30 శాతం పెరిగింది.

Next Story