బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్‌న్యూస్

by Harish |   ( Updated:2024-02-10 07:52:17.0  )
బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్‌న్యూస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సావరిన్ గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ సోమవారం నుంచి ఐదురోజుల పాటు అందుబాటులో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు గోల్డ్ బాండ్లు రాగా ఇప్పుడు నాలుగోసారి వస్తుంది. ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు సబ్‌స్క్రిప్షన్ ఓపెన్ అయి ఉంటుంది. ఇష్యూ ధర గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా ఈ బాండ్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి రూ.50 తగ్గింపు లభిస్తుంది. దీంతో వారు రూ.6,213కే గోల్డ్ బాండ్ కొనుగోలు చేయవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ వ్యవధి 8 సంవత్సరాలుగా ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీరేటు 2.50 శాతం ఉంది. వీటిని లోన్‌లు పొందడానికి పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. అలాగే, మెచ్యూరిటీపై పొందే మొత్తంపై ఎలాంటి టాక్స్ వర్తించదు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) ద్వారా సబ్‌స్క్రిప్షన్ పీరియడ్‌కు ముందు వారంలోని చివరి మూడు రోజుల్లో బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా సావరిన్ గోల్డ్ ధరను నిర్ణయిస్తారు.

భౌతిక బంగారం డిమాండ్‌ను తగ్గించడం, బంగారం కొనుగోలు కోసం ఉపయోగించే అమౌంట్‌ను ఆర్థిక పొదుపుగా మర్చడానికి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నవంబర్ 2015లో ప్రారంభించారు. భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లను జారీ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed